గౌతమ్ గంభీర్‌కి ‘బ్లాంక్ చెక్’ ఆఫర్ చేసిన షారుఖ్ ఖాన్!

  • లక్నో జట్టుకి కోచ్‌గా ఉన్న సమయంలో కోల్‌కతా మెంటార్‌గా రావాలంటూ గంభీర్‌ని కోరిన షారుఖ్
  • 10 ఏళ్లపాటు కోల్‌కతా జట్టుతో కొనసాగాలని అభ్యర్థన
  • ఇందుకోసం ‘బ్లాంక్ చెక్’ ఆఫర్ చేశారంటున్న మీడియా కథనాలు
ఐపీఎల్ 2024 ట్రోఫీని కోల్‌కతా నైట్ రైడర్స్ గెలవడంతో ఆ జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్ కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను మార్చడం, ఆటగాళ్లకు సూచనలు ఇవ్వడం ద్వారా జట్టుని విజేతగా నిలపడంలో తనవంతు పాత్ర పోషించాడు. కోల్‌కతా జట్టు ఐపీఎల్ 2024 టైటిల్ గెలిచిన నేపథ్యంలో గంభీర్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.

ఐపీఎల్ 2023 సీజన్‌‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కి కోచ్ గా వ్యవహరిస్తున్న సమయంలో కోల్‌కతా జట్టుకు మెంటార్‌గా రావాలంటూ గౌతమ్ గంభీర్‌ను షారుఖ్ ఖాన్ కోరారని, ఇందుకుగానూ ఏకంగా ‘బ్లాంక్ చెక్’ను ఆఫర్ చేశారని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. పదేళ్లపాటు కోల్‌కతా జట్టుకి పనిచేయాలంటూ షారుఖ్ అడిగారని తెలిపింది. గంభీర్‌ను ఎక్కువ కాలం పాటు జట్టుతో ఉంచాలనే ఉద్దేశంతో షారుఖ్ ఈ భారీ ఆఫర్ చేసినట్టు పేర్కొంది. కాగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు షారుఖ్ ఖాన్ సహ యజమాని అనే విషయం తెలిసిందే.

కాగా టీమిండియా కోచ్‌ రేసులో మాజీ క్రికెటర్ గౌతమ్ ముందు వరుసలో ఉన్నాడని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. పలువురు విదేశీ కోచ్‌లు రేసు నుంచి తప్పుకోవడంతో బీసీసీఐ ముందు పెద్దగా ఆప్షన్లు లేవని, టీమ్ ఇండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ వారసుడు గౌతమ్ గంభీరేనని చెబుతున్నాయి. మరోవైపు గంభీర్ కూడా భారత కోచ్ పదవిపై ఆసక్తి చూపుతున్నట్లు ‘దైనిక్ జాగరణ్‌’ కథనం పేర్కొంది. ఒకవేళ టీమిండియా కోచ్‌గా వ్యవహరిస్తే కోల్‌కతా జట్టుకు మెంటార్‌గా కొనసాగడం కుదురుతుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.


More Telugu News