అనంతపురం ఏఆర్ అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణరెడ్డిపై వేటు

  • పోలింగ్ అనంతరం తాడిపత్రిలో హింస
  • అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణరెడ్డిని డీజీపీ కార్యాలయానికి సరెండర్ చేసిన డీఐజీ
  • బాధ్యతారాహిత్యంతో వ్యవహరించారంటూ ఆరోపణలు
పోలింగ్ అనంతరం అనంతపురం జిల్లా తాడిపత్రిలోనూ హింస చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా ఆర్మడ్ రిజర్వ్ అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణరెడ్డిపై వేటు పడింది. లక్ష్మీనారాయణరెడ్డిని అనంతపురం రేంజి డీఐజీ... డీజీపీ కార్యాలయానికి సరెండర్ చేశారు. 

తాడిపత్రి అల్లర్ల సమయంలో అదనపు బలగాలు కావాలని గత ఎస్పీ అమిత్ బర్దర్ కోరగా... బలగాలు తగినన్ని లేవంటూ బాధ్యతారాహిత్యంతో వ్యవహరించారని లక్ష్మీనారాయణరెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. అదనపు బలగాలు పంపకపోవడంతో, అల్లర్లు పెరిగినట్టు అమిత్ బర్దర్ తన నివేదికలో పేర్కొన్నారు. అల్లర్ల నేపథ్యంలో అనంతపురం జిల్లా ఎస్పీగా ఉన్న అమిత్ బర్దర్ పై ఈసీ వేటు వేసింది. 

ఆ తర్వాత గౌతమి సాలి అనంతపురం జిల్లా కొత్త ఎస్పీగా వచ్చారు. తాడిపత్రి అల్లర్లపై లోతుగా దృష్టి సారించిన ఎస్పీ గౌతమి సాలి... ఏఆర్ అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణరెడ్డిని పిలిచి వివరాలు అడిగారు. అయితే, లక్ష్మీనారాయణరెడ్డి ఎస్పీ గౌతమి సాలి వద్ద పొంతనలేని సమాధానాలు చెప్పినట్టు తెలుస్తోంది. 

లక్ష్మీనారాయణరెడ్డి తీరుపై అనంతపురం ఎస్పీ గౌతమి సాలి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై వేటు పడినట్టు తెలుస్తోంది.


More Telugu News