113 పరుగులకే కుప్పకూలిన సన్ రైజర్స్... బౌలర్లు అద్భుతం చేస్తారా...?

  • నేడు ఐపీఎల్ ఫైనల్
  • సన్ రైజర్స్ × కోల్ కతా నైట్ రైడర్స్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్
  • విజృంభించిన కోల్ కతా బౌలర్లు
  • 18.3 ఓవర్లలో సన్ రైజర్స్ ఆలౌట్
ఐపీఎల్ 17వ సీజన్ ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 18.3 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. టాపార్డర్ వైఫల్యం బ్యాటింగ్ ను దెబ్బతీసింది. కోల్ కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న ఈ అంతిమ సమరంలో సన్ రైజర్స్ గెలవాలంటే బౌలర్లు ఏదైనా అద్భుతం చేయాల్సిందే. 

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టుకు ఏదీ కలిసి రాలేదు. ఊపుమీదున్న కోల్ కతా పేసర్ మిచెల్ స్టార్క్ నుంచి  ట్రావిస్ హెడ్ వికెట్ ను కాపాడేందుకు తాను స్ట్రయికింగ్ తీసుకున్న అభిషేక్ శర్మ... తన వికెట్ ను కాపాడుకోలేకపోయాడు. కేవలం 2 పరుగులు చేసిన అభిషేక్ శర్మ... స్టార్క్ విసిరిన ఓ అద్భుతమైన అవుట్ స్వింగర్ కు బలయ్యాడు. 

ఆ తర్వాతి ఓవర్లోనే హెడ్ (0) డకౌట్ అయ్యాడు. ఈ వికెట్ వైభవ్ అరోరాకి దక్కింది. ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి (9)ని కూడా అవుట్ చేసిన స్టార్క్ సన్ రైజర్స్ ను గట్టి దెబ్బకొట్టాడు. ఈ దశలో ఐడెన్ మార్ క్రమ్ (20), నితీశ్ రెడ్డి (13) జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా అది కాసేపే అయింది. 

క్లాసెన్ (16) మరోసారి ఆపద్బాంధవుడు అవుతాడనుకుంటే... ఈసారి ఆ ఆశలు నెరవేరలేదు. షాబాజ్ అహ్మద్ (8) కూడా నిరాశపరిచాడు. చివర్లో కెప్టెన్ పాట్ కమిన్స్ 19 బంతుల్లో 24 పరుగులు చేయడంతో సన్ రైజర్స్ స్కోరు కనీసం 100 పరుగుల మార్కును దాటింది. 

ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన అబ్దుల్ సమద్ 4 పరుగులకే వెనుదిరిగాడు. కోల్ కతా బౌలర్లలో ఆండ్రీ రసెల్ 3, మిచెల్ స్టార్క్ 2, హర్షిత్ రాణా 2, వైభవ్ అరోరా 1, సునీల్ నరైన్ 1, వరుణ్ చక్రవర్తి 1 వికెట్ తీశారు.


More Telugu News