జమ్మూకశ్మీర్​ విషయంలో చేయబోయేది అదే..: అమిత్​ షా

  • ప్రస్తుతం జమ్మూకశ్మీర్ లో లోక్ సభ ఎన్నికలు పూర్తి
  • త్వరలోనే  రాష్ట్ర హోదా కల్పిస్తామన్న కేంద్ర హోం మంత్రి
  • సెప్టెంబర్ 30 నాటికి జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడి
ఆర్టికల్ 370 రద్దు నాటి నుంచి రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్మూకశ్మీర్ ప్రాంతానికి త్వరలోనే రాష్ట్ర హోదా కల్పిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. లోక్ సభ ఎన్నికల ఆరో విడతలో భాగంగా జమ్మూకశ్మీర్ లోని ఎంపీ స్థానాలకు ప్రశాంతంగా ఎన్నికలు పూర్తయ్యాయని ఆయన తెలిపారు. తమ ప్రభుత్వం కశ్మీర్ విషయంలో అనుసరించిన విధానం సరైనదేనని ఇది నిరూపిస్తోందని చెప్పారు.  ఇది ఎన్డీయే ప్రభుత్వం సాధించిన అతి పెద్ద విజయమని వ్యాఖ్యానించారు.

ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..
లోక్ సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో అమిత్ షా తాజాగా ప్రముఖ వార్తాసంస్థ పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్ కు సంబంధించిన అంశాలపై మాట్లాడారు. జమ్మూకశ్మీర్ లో లోక్‌ సభ ఎన్నికలు ప్రశాంతంగా జరగడంపై హర్షం వ్యక్తం చేశారు.  

ఇది అతిపెద్ద విజయం
లోక్ సభ ఎన్నికల్లో కశ్మీర్‌ లోని వేర్పాటు వాదులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఓటు వేశారని.. అత్యధిక పోలింగ్‌ శాతం నమోదైందని అమిత్ షా చెప్పారు. ఇది చాలా ముఖ్యమైన పరిణామమని అభివర్ణించారు. జమ్మూకశ్మీర్ ప్రాంతంలో ప్రశాంతంగా, అత్యధిక స్థాయిలో పోలింగ్‌ జరగడమనేది మోదీ ప్రభుత్వం సాధించిన పెద్ద విజయమన్నారు. తమ ప్రణాళిక ప్రకారం.. జమ్మూకశ్మీర్ లో అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన సర్వేలు జరుగుతున్నాయని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ ఏడాది సెప్టెంబరు 30 నాటికి జమ్మూకశ్మీర్ కు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.

బీజేపీని బలోపేతం చేస్తున్నాం..
ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో జమ్మూకశ్మీర్ లో బీజేపీ అభ్యర్థిని బరిలోకి దింపకపోవడానికి పలు కారణాలు ఉన్నాయని చెప్పారు. తమ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టామని.. భవిష్యత్తులో తమ అభ్యర్థులను పోటీకి పెడతామని తెలిపారు.


More Telugu News