గ్రాడ్యుయేట్ ఓట్లను కొనుగోలు చేసేందుకు బీఆర్ఎస్ యత్నిస్తోంది... ఇవిగో ఆధారాలు: రఘునందన్ రావు

  • తెలంగాణలో రేపు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు
  • బీఆర్ఎస్ పార్టీ రూ.30 కోట్లు కుమ్మరిస్తోందన్న రఘునందన్ రావు
  • సీఈసీకి, తెలంగాణ సీఈవోకి లేఖ
  • బీఆర్ఎస్ కి చెందినవిగా పేర్కొంటూ పలు బ్యాంకు ఖాతాల వివరాలు కూడా జోడించిన వైనం
తెలంగాణలో రేపు (మే 27)  మరో కీలక ఎన్నికల సమరం జరగనుంది. సోమవారం నాడు ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తున్నారు. బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేశ్ రెడ్డి ప్రధాన అభ్యర్థులుగా ఉన్నారు. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో  మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 

ఈ నేపథ్యంలో బీజేపీ నేత రఘునందన్ రావు బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. గ్రాడ్యుయేట్ ఓట్లను కొనుగోలు చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని, అందుకు ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. రూ.30 కోట్లతో గ్రాడ్యుయేట్ ఓట్లను కొనుగోలు చేయాలన్నది బీఆర్ఎస్ ప్రణాళిక అని ఆరోపించారు. 

ఈ మేరకు రఘునందన్ రావు నేడు కేంద్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్, తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాశారు. ఈ లేఖతో పాటు, బీఆర్ఎస్ వ్యక్తులకు చెందినవిగా పేర్కొంటూ పలు బ్యాంక్ ఖాతాల వివరాలను కూడా జోడించారు. 

ఈ బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదును వెంటనే స్తంభింపజేయాలని, ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా చూడాలని రఘునందన్ రావు ఎన్నికల సంఘాన్ని కోరారు.


More Telugu News