కష్టాల్లో మాల్దీవులు.. ఆదుకోవాలంటూ అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి

  • మాల్దీవులు, ఆటిగ్వా, బార్బుడా సంయుక్త అధ్యక్షతన సోమవారం సదస్సు
  • వాతావరణ మార్పులతో సముద్రమట్టాలు పెరిగిపోతున్నాయన్న మాల్దీవుల అధ్యక్షుడు
  • ధనిక దేశాల సాయం లేకుండా గట్టెక్కడం కష్టమని వ్యాఖ్య
  • అంతర్జాతీయ సమాజం నుంచి తగినన్ని నిధులు రావట్లేదని ఆందోళన
పర్యావరణ మార్పుల కారణంగా అవస్థలు పడుతున్న మాల్దీవులకు అంతర్జాతీయ సమాజం నుంచి ఆర్థిక సాయం అందట్లేదని ఆ దేశ అధ్యక్షుడు ముహమ్మద్ ముయిజ్జు ఆందోళన వ్యక్తం చేశారు. సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయని, వాటి నుంచి రక్షణ కల్పించేందుకు తమకు ధనిక దేశాల సాయం కావాలని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 0.003 ఉద్గారాలు మాత్రమే మాల్దీవుల నుంచి వెలువడుతున్నాయని తెలిపారు. కానీ పర్యావరణ సంక్షోభం, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు నష్టపోతున్న దేశాల్లో మాల్దీవులు ప్రథమస్థానంలో ఉంటోందని ముయిజ్జు ఆవేదన వ్యక్తం చేశారు. ధనిక దేశాలు మానవతా దృక్పథంతో సాయం చేసి మాల్దీవుల లాంటి దేశాలను ఆదుకోవాలని ఆయన అభ్యర్థించారు. 

పర్యాటకమే ప్రధాన వనరుగా మనుగడ కొనసాగిస్తున్న ద్వీప దేశాలు ప్రతి ఐదేళ్లకొకసారి సమావేశమై అభివృద్ది చర్యలపై చర్చిస్తాయి. తాజాగా మాల్దీవులు, ఆటిగ్వా, బార్బుడా సంయుక్త అధ్యక్షతన సోమవారం సదస్సు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ముయిజ్జు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నామమాత్రపు అభివృద్ధి సాధించిన దేశాల ఆదాయంతో పోలిస్తే కేవలం 14 శాతం ఆదాయం మాత్రమే ఎస్ఐడీఎస్ దేశాలకు వస్తోందని ముయిజ్జు ఈ సందర్భంగా అన్నారు. సముద్ర మట్టాల పెరుగుదలతో కలిగే నష్టాన్నీ భర్తీ చేసుకునేందుకు తమకు 500 మిలియన్ డాలర్ల నిధులు కావాలని ముయిజ్జు పేర్కొన్నాడు. ధనిక దేశాల సాయం లేకుండా ఈ మొత్తాన్ని సమకూర్చుకోవడం తమకు తలకు మించిన భారమని పేర్కొన్నారు. 

ఇక పర్యావరణ మార్పుల నుంచి బయటపడేందుకు మాల్దీవులు అనేక చర్యలు చేపడుతోంది. దాదాపు 30 వేల అపార్ట్ మెంట్లతో రాస్ మాలే పేరిట ఓ కృత్రిమ ద్వీపాన్ని నిర్మించింది. ఇందులో అనేక నిర్మాణాలను చైనా సంస్థలకే కట్టబెట్టింది.


More Telugu News