గర్భంలో ఉన్నది ఆడా? మగా? తెలుసుకునేందుకు భార్య పొట్ట కోసిన భర్తకు యావజ్జీవం

గర్భంలో ఉన్నది ఆడా? మగా? తెలుసుకునేందుకు భార్య పొట్ట కోసిన భర్తకు యావజ్జీవం
  • 2020లో ఉత్తరప్రదేశ్‌లో ఘటన
  • అప్పటికే దంపతులకు ఐదుగురు అమ్మాయిలు
  • అబ్బాయి కోసం తరచూ భార్యాభర్తల మధ్య తగాదా
  • 8 నెలల గర్భంతో ఉండగా భార్య పొట్టకోసిన భర్త
  • పుట్టకుండానే కన్నుమూసిన కవలలు 
  • మృత్యుముఖం నుంచి బయటపడిన భార్య
  • నిందితుడిని దోషిగా తేల్చి శిక్ష ఖరారు చేసిన కోర్టు
గర్భవతి అయిన తన భార్య కడుపులో పెరుగుతున్నది ఎవరో తెలుసుకునేందుకు ఓ భర్త ఎవరూ పాల్పడని కిరాతకానికి పాల్పడ్డాడు. లోపలున్నది ఆడా? మగా? అని తెలుసుకునేందుకు భార్య పొట్టను చీల్చాడు. 2020లో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి తాజాగా కోర్టు తీర్పు వెలువడింది. నిందితుడిని దోషిగా నిర్ధారించిన కోర్టు అతడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.  

బదౌన్ సివిల్ లేన్స్‌కు చెందిన పన్నాలాల్ తన భార్య అనితపై దాడి చేసి పొట్టను కత్తితో చీల్చాడు. ఈ ఘటనలో ఆమె త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడినా లోపలున్న కవలలు బాబు, పాప ప్రాణాలు కోల్పోయారు. 

పన్నాలాల్, అనితకు వివాహమై 22 ఏళ్లు అయింది. అప్పటికే వారికి ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. ఎలాగైనా అబ్బాయి పుట్టాలని పన్నాలాల్ కలలు కనేవాడు. ఈ విషయంలో భార్యాభర్తలకు తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈసారి బాబుకు జన్మినివ్వకుంటే విడాకులు ఇచ్చి మరొకరిని పెళ్లాడతానని భార్యను బెదిరించేవాడు.

ఈ క్రమంలో అనిత మరోమారు గర్భం దాల్చింది. ఆమె 8 నెలల గర్భతిగా ఉన్నప్పుడు మరోమారు ఇద్దరికీ ఇదే విషయంలో గొడవైంది. దీంతో కోపంతో ఊగిపోయిన పన్నాలాల్ లోపల పెరుగుతున్నది ఆడా? మగా? ఎవరో తెలుసుకునేందుకు కత్తితో ఆమె పొట్టను చీల్చాడు. దీంతో ప్రాణభయంతో రక్తమోడుతూనే ఆమె వీధుల వెంట పరుగులు తీసింది. అనిత అరుపులు విన్న ఆమె సోదరుడు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించాడు.

ఈ ఘటన తర్వాత పన్నాలాల్ పరారయ్యాడు. చికిత్స తర్వాత అనిత కోలుకున్నప్పటికీ ఆమె పిల్లలిద్దరూ మరణించారు. తనపై కేసు పెట్టేందుకు భార్యే తనకు తానుగా పొట్ట చీల్చుకుందని పన్నాలాల్ కోర్టును నమ్మించే ప్రయత్నం చేశాడు. తాజాగా, ఈ కేసు విచారణకు రాగా ఆధారాలను పరిశీలించిన కోర్టు నిందితుడిని దోషిగా తేల్చి యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.


More Telugu News