రైస్ మిల్లర్లు, బిడ్డర్లతో రాష్ట్ర ప్రభుత్వం చీకటి ఒప్పందం కుదుర్చుకుంది: తెలంగాణ బీజేపీ శాసన సభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి

  • జలసౌధలో మంత్రి, కమిషనర్ల సమక్షంలో మిల్లర్లు, కాంట్రాక్టర్లు, బిడ్డర్లను పిలిచి ఏం చేశారో చెప్పాలని నిలదీత
  • 35 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంపై అదనంగా రూ.800 కోట్లు అక్రమంగా వసూలు చేస్తున్నారని ఆరోపణ
  • సన్నబియ్యాన్ని ప్రభుత్వమే బిడ్డర్లకు అమ్మి... వారి వద్ద నుంచే అధిక ధరకు కొనడం ఎందుకో చెప్పాలని ప్రశ్న
రైస్ మిల్లర్లు, బిడ్డర్లతో రాష్ట్ర ప్రభుత్వం చీకటి ఒప్పందం కుదుర్చుకుందని తెలంగాణ బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. జలసౌధలో జరిగిన డీల్ ఏమిటి? జలసౌధలో మంత్రి, కమిషనర్ సమక్షంలో రైస్ మిల్లర్లను, కాంట్రాక్టర్లను, బిడ్డర్లను పిలిపించి చేసిన చీకటి ఒప్పందం ఏమిటో చెప్పాలన్నారు. ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం సమయం కోరితే... ఎఫ్‌సీఐ అంగీకరించిందని... అయినప్పటికీ ప్రభుత్వం టెండర్‌కు తెరలేపిందని మండిపడ్డారు.

35 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంపై అదనంగా రూ.800 కోట్లు అక్రమంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ డబ్బు ఎవరి ఖాతాలోకి వెళుతుందో మంత్రి చెప్పాలని నిలదీశారు. ధాన్యం దక్కించుకోవడానికి కాంట్రాక్టర్లకు ఇచ్చిన గడువు 90 రోజులు అని... మరి గడువు దాటినందుకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు. 1.59 లక్షల టన్నుల సన్నబియ్యాన్ని ప్రభుత్వమే బిడ్డర్లకు అమ్మిందని ఆరోపించారు. మళ్లీ అధిక ధరకు బిడ్డర్ల నుంచి సన్నబియ్యం కొనడం ఎందుకో చెప్పాలన్నారు.


More Telugu News