ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా ఓటేశా.. మీరూ ఓటేయండి: కేజ్రీవాల్

  • కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న ఢిల్లీ సీఎం
  • తీవ్ర అనారోగ్యం కారణంగా తన తల్లి పోలింగ్ బూత్ కు రాలేకపోయిందని వివరణ
  • ఓటు వేయాలంటూ ఢిల్లీ వాసులకు పిలుపు
‘ధరల పెరుగుదల, నియంతృత్వం, నిరుద్యోగితలను గుర్తుచేసుకుంటూ ఓటేశా.. మీరు కూడా పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోండి’ అంటూ ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ వాసులకు పిలుపునిచ్చారు. బయట చాలా వేడిగా ఉన్నమాట నిజమేనని, అలాగని ఇంట్లోనే కూర్చోకుండా విధిగా ఓటు వేసి రావాలని అభ్యర్థించారు. శనివారం ఉదయం కుటుంబంతో కలిసి పోలింగ్ బూత్ కు వచ్చిన కేజ్రీవాల్.. లైన్ లో నిలుచుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం పోలింగ్ బూత్ బయట మీడియాతో మాట్లాడారు.

తన తండ్రి, తన భార్యా పిల్లలతో కలిసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నట్లు కేజ్రీవాల్ చెప్పారు. తన తల్లికి తీవ్ర అనారోగ్యం కారణంగా పోలింగ్ బూత్ వరకు రాలేకపోయిందని వివరించారు. రాచరికపు పోకడలతో నియంతృత్వంగా వ్యవహరిస్తున్న వారిని గుర్తుచేసుకుంటూ, పెరుగుతున్న ధరలను, నిరుద్యోగితను దృష్టిలో పెట్టుకుని ఓటు వేశానని తెలిపారు.

 కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీలో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ ఇటీవల అరెస్టైన విషయం తెలిసిందే. లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఆప్ తరఫున ప్రచారం నిర్వహించేందుకు కోర్టు తాత్కాలిక బెయిల్ ఇవ్వడంతో కేజ్రీవాల్ బయటకు వచ్చారు. వచ్చే నెల (జూన్ 1) చివరి దశ పోలింగ్ పూర్తయ్యాక మరుసటి రోజు కేజ్రీవాల్ జైలు అధికారుల ముందు లొంగిపోవాలని కోర్టు సూచించింది.



More Telugu News