పూణె యాక్సిడెంట్ కేసులో మరో మలుపు.. డ్రైవర్‌పై నేరం మోపే ప్రయత్నం చేసిన బాలుడి తాత అరెస్ట్

  • రోజుకో మలుపు తిరుగుతున్న పూణె యాక్సిడెంట్ కేసు వ్యవహారం
  • మద్యం మత్తులో కారు డ్రైవ్ చేసి ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల మరణానికి కారణమైన బాలుడు 
  • కారు డ్రైవర్‌ను కిడ్నాప్ చేసి ఫోన్ లాక్కుని నేరం తనపై వేసుకోవాలని బెదిరింపులు
పూణె బాలుడి డ్రంకెన్ డ్రైవ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. పోలీసులు ఈ ఉదయం బాలుడి తాతను అరెస్ట్ చేశారు. పూణెలోనే టాప్ రియల్టర్ అయిన ఆయనపై కిడ్నాప్, పోర్షేకారు డ్రైవర్‌ అక్రమ నిర్బంధం వంటివి నమోదయ్యాయి. అంతేకాదు, అండర్‌వరల్డ్ డాన్ చోటా రాజన్‌తోనూ ఆయనకు సంబంధాలు ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఈ దిశగానూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేసినట్టు పూణె సిటీ కమిషనర్ అమితేశ్ కుమార్ తెలిపారు. 

యరవాడ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం..  19-20 రాత్రి పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వచ్చిన తనను బాలుడి తాత బలవంతంగా ఇంటికి తీసుకెళ్లి బీఎండబ్ల్యూ కారులో కూర్చోబెట్టారని డ్రైవర్ (42) ఆరోపించారు. అక్కడ నిందితుడి తండ్రి డ్రైవర్ ఫోన్ లాక్కుని అక్రమంగా నిర్బంధించారని, ఆ తర్వాత ప్రమాద సమయంలో కారు నడిపింది తానేనని చెప్పి ఆ నేరాన్ని తనపై వేసుకోమన్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇప్పటికే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న బాలుడి తండ్రిపైనా తాజా కేసు నమోదైంది. 

ఈ నెల 19న బార్‌లో స్నేహితులతో కలిసి మద్యం తాగిన బాలుడు ఆ తర్వాత తన లగ్జరీ పోర్షే కారులో ఇంటికి తిరిగి వస్తూ బైక్‌పై వెళ్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అయిన యువతీయువకులని ఢీకొట్టాడు. తీవ్ర గాయాలపాలైన వారిద్దరూ మృతి చెందారు. ఈ కేసులో అరెస్ట్ అయిన బాలుడికి తొలుత 14 గంటల్లోనే జువైనల్ కోర్టు బెయిలు మంజూరు చేసింది. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో తన ఆదేశాలను వెనక్కి తీసుకుని జూన్ 5 వరకు రిమాండ్ విధించింది.


More Telugu News