పపూవా న్యూగినియాలో మరింత విషాదం.. 300 మందికిపైగా సజీవ సమాధి

  • శిథిలాలు, బురదలో చిక్కుకున్న వారి ఆర్తనాదాలతో దయనీయ పరిస్థితులు
  • దేశంలోని ఇతర ప్రాంతాలతో కావోకలమ్ గ్రామానికి తెగిపోయిన సంబంధాలు
  • పెద్ద ఎత్తున కొనసాగుతున్న సహాయక చర్యలు
పాపువా న్యూగినియాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా విరుచుకుపడిన కొండచరియలు వందలాదిమందిని సజీవ సమాధి చేశాయి. ఎంగా ప్రావిన్స్‌లోని కావోకలమ్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడి ఇళ్ల మీద పడడంతో నిద్రలో ఉన్నవారు శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. 

వందలాది ఇళ్లను కొండచరియలు నేలమట్టం చేశాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 300 మందికిపైగా మృతి చెంది ఉంటారని అధికారులు తెలిపారు. 1182 ఇళ్లను నామరూపాల్లేకుండా తుడిచిపెట్టేశాయి. మలిటాకా ప్రాంతంలో ఆరుకుపైగా గ్రామాలపై కొండచరియలు విరిగిపడినట్టు ఆస్ట్రేలియా విదేశాంగ వ్యవహారాలు, వాణిజ్య విభాగం తెలిపింది.

విరిగిపడిన కొండచరియలు జాతీయ రహదారిని దిగ్బంధం చేశాయి. ఫలితంగా హెలికాప్టర్లతో తప్ప బాధిత గ్రామాలకు చేరుకోలేని పరిస్థితి నెలకొంది. శిథిలాలు, బురదలో చిక్కుకున్న చిన్నారులు, మహిళల ఆర్తనాదాలతో కావోకలమ్ గ్రామంలో ఎటుచూసినా విషాదమే కనిపిస్తోంది. జాతీయ రహదారిపై విరుచుకుపడిన కొండ చరియలను తొలగించి గ్రామంతో తిరిగి సంబంధాలను పునరుద్ధరించేందుకు డిజాస్టర్, డిఫెన్స్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ వర్క్స్ అండ్ హైవేస్‌ను రంగంలోకి దిగించినట్టు ప్రధానమంత్రి జేమ్స్ మరాపె తెలిపారు.


More Telugu News