సన్‌రైజర్స్ గెలుపునకు టర్నింగ్ పాయింట్ ఏదో చెప్పిన రాజస్థాన్ కోచ్ సంగక్కర

  • యశస్వి జైస్వాల్ వికెట్‌ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ అన్న రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్
  • ఎడమ చేతి వాటం స్పిన్నర్‌తో బౌలింగ్ చేయించి సన్‌రైజర్స్ సక్సెస్ అయ్యారన్న సంగక్కర
  • ప్లే ఆఫ్స్‌లో ఇలాంటి మ్యాచ్‌లు గెలవడం అంత తేలిక కాదని వ్యాఖ్య
శుక్రవారం రాత్రి చెన్నై వేదికగా జరిగిన ఐపీఎల్-2024 క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించి ఫైనల్‌లో అడుగుపెట్టింది. తొలుత బ్యాటింగ్ చేసి నిర్దేశించిన 175 పరుగుల స్కోరుని సన్‌రైజర్స్ కాపాడుకోవడం కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో రాజస్థాన్‌పై హైదరాబాద్ తిరుగులేని విజయం సాధించింది. ఈ మ్యాచ్‌పై రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ కుమార సంగక్కర స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాజస్థాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ వికెట్ ఈ మ్యాచ్‌లో టర్నింగ్ పాయింట్ అని అభిప్రాయపడ్డాడు. జైస్వాల్ ఔటయ్యాక మ్యాచ్ మలుపు తిరిగిందని పేర్కొన్నాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ షాబాజ్ ఖాన్‌తో బౌలింగ్ చేయించి విజయవంతమయ్యారని సంగక్కర అన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో జైస్వాల్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్‌ల వికెట్లను షాబాజ్ ఖాన్ తీశాడు. దీంతో మ్యాచ్ మలుపు తిరిగింది.

కీలక దశలో వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ ఓడిపోయామని భావిస్తున్నట్టు సంగక్కర చెప్పాడు. పవర్‌ప్లేలో 51 పరుగులతో చక్కటి స్థితిలో ఉన్నామని, ఆ తర్వాత 14 లేదా 15వ ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోరు 120 పరుగులుగా ఉందన్నాడు. చేతిలో వికెట్లు ఉండడంతో ఓవర్‌కు 11 లేదా 10 పరుగులు చేయడం పెద్దగా కష్టమేమీ కాదని, కానీ వరుసగా వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ చేజారిందని విశ్లేషించాడు. రాజస్థాన్ బ్యాటర్లు మంచి భాగస్వామ్యాలను నెలకొల్పలేకపోయారని అభిప్రాయపడ్డాడు.

ఫ్లే ఆఫ్స్‌లో ఇలాంటి ఛేజింగ్‌లు అంత తేలిక కాదని సంగక్కర అభిప్రాయపడ్డాడు. ఇది చాలా కష్టమైన మ్యాచ్ అని, ధృవ్ జురెల్ మాదిరిగా ఇతర ఆటగాళ్లు దూకుడుగా ఆడి ఉంటే బావుండేదని అన్నాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంగక్కర ఈ వ్యాఖ్యలు చేశాడు.


More Telugu News