రాజస్థాన్‌కు ‘షాబాజ్ మాస్టర్ స్ట్రోక్’.. ఈ ప్లాన్ ఇచ్చింది ఎవరో చెప్పిన సన్‌రైజర్స్ కెప్టెన్

  • బ్యాటింగ్‌లో కీలక వికెట్లు పడడంతో ఇంపాక్ట్ ప్లేయర్‌గా షాబాజ్ ను పంపించిన కెప్టెన్
  • ఆ తర్వాత బౌలింగ్‌లో అద్భుతం చేసిన యంగ్ ప్లేయర్
  • షాబాజ్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించాలనే ప్లాన్ హెడ్ కోచ్ డేనియల్ వెట్టోరి ఇచ్చాడన్న కమ్మిన్స్
క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో టాస్ ఓడి.. తడబడుతూ తొలుత బ్యాటింగ్ చేసి ప్రత్యర్థి రాజస్థాన్ రాయల్స్‌కు 176 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుస్తుందని పెద్దగా నమ్మకాలు లేవు. ఎందుకంటే ఈ సీజన్‌ ఐపీఎల్‌లో జట్లు భారీ లక్ష్యాలను సైతం అలవోకగా ఛేదించాయి. దీంతో సన్‌రైజర్స్ టార్గెట్‌ని కాపాడుకోవడం కష్టమేనని, ఫైనల్ చేరుకోవడం దాదాపు అసాధ్యమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 

ఇక రాజస్థాన్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ఆరంభమై... ఆరేడు ఓవర్ల వరకు ఇదే పరిస్థితి కనిపించింది. కానీ ఆ తర్వాత సన్‌రైజర్స్ క్రమక్రమంగా మ్యాచ్‌పై పట్టుబిగించింది. ఇందుకు ప్రధాన కారణం ఇంపాక్ట్ ప్లేయర్ ‘షాబాజ్ ఖాన్. 4 ఓవర్లు బౌలింగ్ చేసిన షాబాజ్ కేవలం 23 పరుగులే ఇచ్చి అత్యంత కీలకమైన 3 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో 18 పరుగులు రాబట్టి సన్‌రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కూడా అతడికే లభించింది. అయితే షాబాజ్ ఖాన్‌ను తొలుత తుది జట్టులోకి తీసుకోలేదు. కానీ రాజస్థాన్ రాయల్స్‌కు మాస్టర్ స్ట్రోక్ ఇస్తూ ఇంపాక్ట్ ప్లేయర్‌గా అతడిని బరిలోకి దించారు.

మరి మ్యాచ్‌ను మలుపు తిప్పిన షాబాజ్ ఖాన్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించాలనే ప్లాన్‌ను కోచ్ డేనియల్ వెట్టోరి ఇచ్చాడని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్‌ వెల్లడించాడు. జట్టులో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు ఉండడం మంచిదని, షాబాజ్‌ను పంపించాలంటూ ఆయనే చెప్పాడని వివరించాడు. షాబాజ్ అద్భుతంగా బౌలింగ్ చేసి రైట్ హ్యాండ్ బ్యాటర్లను ఔట్ చేశాడని, మ్యాచ్‌ను మలుపు తిప్పాడని కమ్మిన్స్ అభినందించాడు. ఈ మాస్టర్ స్ట్రోక్ ప్లాన్ ఎవరిదని మ్యాచ్ అనంతరం ప్రశ్నించగా కమ్మిన్స్ ఈ సమాధానం ఇచ్చాడు.

కాగా తొలుత తుది జట్టులోకి యంగ్ లెగ్ స్పిన్నర్ మాయాంక్ మార్కండే‌ను తీసుకున్నారు. అయితే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ కీలకమైన వికెట్లు కోల్పోవడంతో ఆల్‌రౌండర్ షాబాజ్‌ ఖాన్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా పంపించారు. స్పిన్ బౌలింగ్ వేసిన మరో ఆల్ రౌండర్ అభిషేక్ శర్మతో కలిసి షాబాజ్ మ్యాచ్‌ను మలుపుతిప్పిన విషయం తెలిసిందే.


More Telugu News