పిన్నెల్లి జూన్ 6 వరకు నరసరావుపేటలోనే ఉండాలి... ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ హైకోర్టు

  • ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లికి నిన్న ఊరట కల్పించిన ఏపీ హైకోర్టు
  • పిన్నెల్లి కదలికలపై ఆంక్షలు విధిస్తూ నేడు ఉత్తర్వులు
  • జూన్ 4న కౌంటింగ్ సందర్భంగా మాచర్ల వెళ్లొద్దని ఆదేశాలు
  • నరసరావుపేట కౌంటింగ్ కేంద్రానికి వెళ్లొచ్చని వెసులుబాటు
ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు  ఊరట కలిగించిన సంగతి తెలిసిందే. జూన్ 6 వరకు పిన్నెల్లిపై చర్యలు వద్దంటూ  హైకోర్టు నిన్నటి విచారణ సందర్భంగా పోలీసులను ఆదేశించింది. 

ఈ నేపథ్యంలో, పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు ధర్మాసనం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. పిన్నెల్లి కదలికలపై ఆంక్షలు విధించింది. వచ్చే నెల 6వ తేదీ వరకు నరసరావుపేటలోనే ఉండాలని స్పష్టం చేసింది. 

జూన్ 4న ఓట్ల లెక్కింపు సందర్భంగా మాచర్ల వెళ్లవద్దని పిన్నెల్లిని ఆదేశించింది. అయితే నరసరావుపేట కౌంటింగ్ కేంద్రానికి వెళ్లొచ్చని వెసులుబాటు కల్పించింది. 

ఇక, కేసు గురించి మీడియాతో మాట్లాడొద్దని ఆదేశించింది. కేసు గురించి సాక్షులతో కూడా మాట్లాడరాదని ఏపీ హైకోర్టు ఆంక్షలు విధించింది. 

అదే సమయంలో, పిన్నెల్లి కదలికలపై పూర్తి స్థాయిలో నిఘా ఉంచాలని... ఈ మేరకు పోలీసులకు ఉత్తర్వులు జారీ చేయాలని ఏపీ సీఈవోని ఆదేశించింది.


More Telugu News