టీమిండియా హెడ్ కోచ్ పదవిపై ఆసీస్ మాజీల వ్యాఖ్యలు... స్పందించిన జై షా

  • టీమిండియా కోచ్ గా కొనసాగేందుకు ద్రావిడ్ విముఖత
  • కొత్త కోచ్ కోసం దరఖాస్తులకు ఆహ్వానం
  • తనను కోచ్ గా రమ్మన్నారని, తాను నో చెప్పానని పాంటింగ్ వెల్లడి
  • టీమిండియా కోచ్ పదవిలో రాజకీయాలు ఉంటాయన్న జస్టిన్ లాంగర్
  • ఆ విషయం తనకు కేఎల్ రాహుల్ చెప్పాడన్న లాంగర్
  • కోచ్ గా రావాలని తాము ఎవరినీ అడగలేదన్న జై షా
టీమిండియా హెడ్ కోచ్ గా కొనసాగేందుకు రాహుల్ ద్రావిడ్ ఆసక్తి చూపకపోవడంతో  బీసీసీఐ కొత్త కోచ్ కోసం వేట మొదలుపెట్టింది. అయితే, టీమిండియా కోచ్ పదవి కోసం తనను సంప్రదించారని, అయితే ఆ ఆఫర్ ను తాను తిరస్కరించానని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ చెప్పాడు. 

ఇక, ఆసీస్ మాజీ ఓపెనర్ జస్టిన్ లాంగర్ మరో అడుగు ముందుకేసి, టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ తన కళ్లు తెరిపించాడని వ్యాఖ్యానించాడు. టీమిండియా హెడ్ కోచ్ పదవి అంటే అనేక రాజకీయాలు ఉంటాయని కేఎల్ రాహుల్ చెప్పాడని, ఆ పదవిని తాను కోరుకోవడంలేదని అన్నాడు. ఈ విధంగా మీడియాలో పలు కథనాలు వస్తున్న నేపథ్యంలో, భారత క్రికెట్ కంట్రోల్  బోర్డు (బీసీసీఐ) కార్యదర్శి జై షా స్పందించారు. 

టీమిండియా కోచ్ గా రావాలంటూ బీసీసీఐ తరఫున ఎవరూ కూడా ఆసీస్ మాజీ క్రికెటర్లను సంప్రదించలేదని జై షా స్పష్టం చేశారు. తామే ఆసీస్ మాజీ క్రికెటర్లను అడిగామంటూ మీడియాలో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని అన్నారు. 

భారత క్రికెట్ వ్యవస్థను సమూలంగా అర్థం చేసుకోగలిగే వ్యక్తి మాత్రమే టీమిండియా హెడ్ కోచ్ గా ఎంపికవుతాడని జై షా వెల్లడించారు. 

భారత జట్టుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణ, భారత క్రికెట్ చరిత్ర, భారత క్రికెట్ ఔన్నత్యం, ఆట పట్ల టీమిండియా, బీసీసీఐ అంకితభావం... వీటన్నింటిపై అవగాహన ఉన్న వ్యక్తి మాత్రమే టీమిండియా హెడ్ కోచ్ పదవికి అర్హుడని జై షా స్పష్టం చేశారు. అలాంటి వ్యక్తి కోసమే తాము అన్వేషిస్తున్నామని చెప్పారు. 

అందువల్లే టీమిండియా కోచ్ ఎంపిక ఓ క్లిష్టమైన ప్రక్రియగా ఉంటోందని తెలిపారు. టీమిండియా హెడ్ కోచ్ పదవి కంటే అంతర్జాతీయ క్రికెట్లో మరో ఆకర్షణీయమైన పదవి ఉంటుందని తాను అనుకోవడంలేదని అన్నారు.


More Telugu News