నేను జైలు నుంచి పోటీ చేస్తే 70 స్థానాలకు 70 గెలుచుకుంటాం: అరవింద్ కేజ్రీవాల్

  • అసెంబ్లీ ఎన్నికల్లో తన భార్య సునీతా కేజ్రీవాల్ పోటీ చేయదని స్పష్టీకరణ
  • ఢిల్లీ ప్రజలు అమాయకులు కాదు... అన్నీ గమనిస్తున్నారని వ్యాఖ్య
  • తనను ఢిల్లీలో ఓడించలేకే మద్యం పాలసీ కేసులో ఇరికించారని ఆరోపణ
వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు తాను జైల్లోనే ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో 70 సీట్లకు 70 గెలుచుకుంటుందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఇండియా టుడే టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... అసెంబ్లీ ఎన్నికల వరకు తాను జైల్లోనే ఉంటే తన భార్య పోటీ చేయదని స్పష్టం చేశారు. తాను జైలు నుంచే పోటీ చేస్తానన్నారు. అప్పుడు ఢిల్లీలో అన్ని స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మా ఎమ్మెల్యేలందరినీ జైల్లో పెట్టి ఢిల్లీలో ఓటింగ్‌కు వెళ్లాలన్నారు. ప్రజలు ఏమైనా అమాయకులా? వారు అన్నీ గమనిస్తున్నారని తెలిపారు.

ఢిల్లీలో తనను ఓడించలేనని తెలిసే ప్రధాని మోదీ ఢిల్లీ మద్యం కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఈ కేసులో ఇరికించి తాను ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాలని చూస్తున్నారన్నారు. తనకు అధికార యావ లేదని... కానీ తాను రాజీనామా చేస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందన్నారు. తనను ఎంతకాలం జైల్లో ఉంచుతారనే దానికి ప్రధాని మోదీ మాత్రమే సమాధానం చెప్పగలరని ఎద్దేవా చేశారు. తాను సీఎం పదవికి రాజీనామా చేస్తే కనుక ఆ తర్వాత మిగిలిన ప్రతిపక్ష ముఖ్యమంత్రులను టార్గెట్ చేస్తారన్నారు.


More Telugu News