తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు... కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ

  • తిరుమల కొండపై పెరిగిన భక్తుల రద్దీ
  • శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ
  • సిఫారసు లేఖలు స్వీకరించబోమని స్పష్టీకరణ
  • ఈ మార్పును గమనించి భక్తులు సహకరించాలని విజ్ఞప్తి
ఎన్నికలు పూర్తి కావడం, వేసవి సెలవులు కొనసాగుతుండడం, విద్యార్థుల పరీక్షల ఫలితాలు విడుదల కావడం వంటి పరిణామాల నేపథ్యంలో... ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. గత కొన్ని రోజులుగా కొండపై విపరీతమైన రద్దీ నెలకొంటోంది. 

ముఖ్యంగా... శుక్ర, శని, ఆదివారాల్లో సామాన్య భక్తులు అధికంగా తరలివస్తున్నారు. వారు స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో సుమారు 30-40 గంటల సమయం పాటు వేచి ఉండాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. 

సామాన్య భక్తులకు త్వరిత గతిన స్వామివారి దర్శనం కల్పించేందుకు జూన్ 30వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేసింది. ఆయా రోజులకు సంబంధించి వీఐపీ సిఫారసు లేఖలు స్వీకరించబోమని టీటీడీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ  మార్పును గమనించి భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేసింది.


More Telugu News