సూపర్ స్టార్ రజనీకాంత్ ను గోల్డెన్ వీసాతో గౌరవించిన యూఏఈ

  • ఆ దేశ సాంస్కృతిక, పర్యాటక శాఖ చైర్మన్ చేతుల మీదుగా అందుకున్న‘తలైవా’
  • కార్యక్రమంలో పాల్గొన్న లులు గ్రూప్ సీఎండీ యూసుఫ్ అలీ
  • సోషల్ మీడియా ద్వారా వారికి కృతజ్ఞతలు తెలిపిన రజనీ.. ఫ్యాన్స్ ఫిదా
సూపర్ స్టార్ రజనీకాంత్ కు అరుదైన గౌరవం లభించింది. యూఏఈ సాంస్కృతిక, పర్యాటక శాఖ (డీటీసీ) రజనీని గోల్డెన్ వీసాతో సత్కరించింది. అబుదాబీలో జరిగిన కార్యక్రమంలో డీటీసీ చైర్మన్ మహమ్మద్ ఖలీఫా అల్ ముబారక్ గోల్డెన్ వీసా కార్డును రజనీకి అందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ మలయాళీ వ్యాపారవేత్త, లులు మాల్ సీఎండీ ఎంఏ యూసుఫ్ అలీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రజనీ ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నారు. ‘అబుధాబీ ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక గోల్డెన్ వీసా అందుకోవడాన్నిగౌరవంగా భావిస్తున్నా. ఇందుకుగాను అబుధాబీ ప్రభుత్వానికి, దాన్ని పొందడంలో సహకరించిన నా స్నేహితుడు, లులు గ్రూప్ సీఎండీ యూసుఫ్ అలీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’ అని రజనీ పేర్కొన్నారు. ఈ వీడియో కాస్తా వెంటనే వైరల్ అయింది. ‘తలైవా’కు లభించిన గౌరవానికి ఆయన ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇటీవల యూఏఈ సందర్శన సందర్భంగా రజనీకాంత్ లులు గ్రూప్ సీఎండీ యూసుఫ్ అలీతోపాటు ఆ సంస్థ ప్రతినిధులను కలిశారు. ఆయనతో కలసి రోల్స్ రాయస్ కార్లో తిరుగుతూ సందడి చేశారు.

ఏమిటీ గోల్డెన్ వీసా ప్రత్యేకత..
యూఏఈలో విదేశీయులు పనిచేసేందుకు, నివసించేందుకు, చదువుకొనేందుకు జారీ చేసేదే గోల్డెన్ వీసా. పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలతోపాటు వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ చూపిన వారికి వాటిని మంజూరు చేస్తారు. దీర్ఘకాలంపాటు యూఏఈలో ఉండాలనుకొనే వారికి అందిస్తారు. ఈ వీసా కాలవ్యవధి ఐదు నుంచి పదేళ్ల మధ్య ఉంటుంది. కాలవ్యవధి ముగిశాక మళ్లీ పునరుద్ధరించుకోవచ్చు. గోల్డెన్ వీసాదారులకు యూఏఈలో చేసే వ్యాపారాలపై పూర్తిస్థాయి యాజమాన్య హక్కులు లభిస్తాయి. ఇది 6 నెలల ఎంట్రీ వీసాగా పనిచేయడంతోపాటు యూఏఈని ఎన్నిసార్లయినా సందర్శించే వెసులుబాటు అందిస్తుంది. కుటుంబ సభ్యులందరితోపాటు ఎంత మంది పనిమనుషులనైనా స్పాన్సర్ చేసేందుకు అవకాశం కల్పిస్తుంది.


More Telugu News