పూణె యాక్సిడెంట్ కేసులో మరో ట్విస్ట్!

  • ఆదివారం తెల్లవారుజామున పూణెలో ప్రమాదం
  • టీనేజర్ కారుతో ఢీకొట్టడంతో ఇద్దరి దుర్మరణం
  • ప్రమాద సమయంలో డ్రైవర్ కారు నడుపుతున్నాడన్న టీనేజర్
  • నిందితుడి తండ్రి, స్నేహితులదీ అదే మాట
  • నిందితుడి తాతను కూడా ప్రశ్నిస్తున్న పోలీసులు  
పూణెలో టీనేజర్ యాక్సిడెంట్ కేసులో తాజాగా మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ప్రమాదం జరిగిన సమయంలో కారు నడిపింది తాను కాదని కేసులో ముద్దాయిగా ఉన్న టీనేజర్ కోర్టుకు తెలిపాడు. కారులో అతడితో పాటూ ప్రయాణించిన ఇద్దరు స్నేహితులు కూడా ఇదే విషయాన్ని తెలిపారు. 

రెండు కోట్ల రూపాయల ఖరీదైన పోర్షే కారును వేగంగా నడుపుతూ నిందితుడు ఆదివారం ఇద్దరు టెకీల మరణానికి కారణమైన విషయం తెలిసిందే. కారుతో వేగంగా వారిని ఢీకొట్టడంతో బాధితులు దుర్మరణం చెందారు. సదరు టీనేజర్ ప్రముఖ రియలెస్టేట్ డెవలపర్ విశాల్ అగర్వాల్ కుమారుడు. ఈ కేసు నుంచి నిందితుడిని తప్పించేందుకు భారీ ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. నిందితుడికి 14 గంటల్లోనే బెయిల్ రావడం తీవ్ర కలకలానికి దారి తీసింది. దీంతో, అతడిని మేజర్ గానే పరిగణిస్తున్నామని పూణె పోలీస్ కమిషనర్ విస్పష్ట ప్రకటన చేయాల్సి వచ్చింది. 

కాగా అతడికి జారీ చేసిన బెయిల్‌ను కూడా పూణె కోర్టు నిన్న రద్దు చేసింది. నిందితుడిని జువెనైల్ సెంటర్ కు పంపించాలని ఆదేశించింది.  

ఇదిలా ఉంటే యాక్సిడెంట్ సమయంలో తాను కారు నడుపుతున్నట్టు వారి డ్రైవర్ తెలిపాడు. ఈ మేరకు పోలీసులకు ఓ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. నిందితుడి తండ్రి కూడా ప్రమాద సమయంలో తన డ్రైవరే కారు నడిపినట్టు పోలీసులకు తెలిపాడు. మరోవైపు, పోలీసులు విశాల్ అగర్వాల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. అందులోని వివరాలను వెలికితీసే పనిలో ఉన్నారు. 

ఇక నిందితుడి తాత సురేంద్ర అగర్వాల్ ను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. టీనేజర్, అతడి తండ్రి గురించి సురేంద్ర నుంచి మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో, పోలీసులు దర్యాప్తులో నిబంధనలు అతిక్రమించారా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది.


More Telugu News