ఎక్కడున్నా వచ్చి పోలీసుల ఎదుట లొంగిపో... లేదంటే..!: ప్రజ్వల్ రేవణ్ణకు దేవెగౌడ హెచ్చరిక

  • విజ్ఞప్తి కాదు... వార్నింగ్ అన్న దేవెగౌడ 
  • తనతో పాటు కుటుంబ సభ్యుల ఆగ్రహానికి గురవుతావని హెచ్చరిక
  • కేసులో దోషిగా తేలితే శిక్ష పడాల్సిందేనని వ్యాఖ్య
లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణను మాజీ ప్రధాని దేవెగౌడ హెచ్చరించారు. ఎక్కడున్నా తక్షణమే పోలీసుల ఎదుట లొంగిపోవాలని సూచించారు. తన సహనాన్ని పరీక్షించవద్దని... లేదంటే తన ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇది విజ్ఞప్తి కాదు.. వార్నింగ్ అన్నారు. తనతో పాటు కుటుంబ సభ్యుల ఆగ్రహానికి గురవుతావన్నారు. కర్ణాటక ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నామన్నారు. ఈ మేరకు ప్రజ్వల్‌ను హెచ్చరిస్తూ ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ పెట్టారు. 

మే 18న ఓ ఆలయానికి వెళుతూ ప్రజ్వల్ గురించి మాట్లాడానని... అతను తనకు, తన కుటుంబానికి, పార్టీకి, శ్రేయోభిలాషులకు కలిగించిన బాధ చెప్పలేనిదన్నారు. ఆ షాక్ నుంచి కోలుకోవడానికి కొంత సమయం పట్టిందన్నారు. కేసులో దోషిగా తేలితే శిక్ష పడాల్సిందే అన్నారు. కుమారస్వామి కూడా ఇదే వైఖరితో ఉన్నారని తెలిపారు.

కొన్ని రోజులుగా తనపైనా, తన కుటుంబంపైనా ప్రజలు కఠినమైన పదాలు వాడుతున్న విషయం తెలుసునని పేర్కొన్నారు. అయితే వాస్తవాలు బయటకు వచ్చేవరకు వాటిని ఆపాలని చెప్పడం కూడా తనకు ఇష్టం లేదన్నారు. తన అరవై ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజలు తన వెంట ఉన్నారని.. ఇందుకు వారికి రుణపడి ఉన్నానన్నారు. వారి విశ్వాసాన్ని తిరిగి పొందడమే తనకు ముఖ్యమైన అంశమన్నారు.


More Telugu News