రాయలసీమలో ఫ్యాక్షనిజం బంద్ అయింది... కొల్లాపూర్‌లో ప్రారంభమైంది: శ్రీనివాస్ గౌడ్

  • కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ దారుణాలకు పాల్పడుతోందని ఆగ్రహం
  • బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధిపై దృష్టి సారించాం తప్ప దారుణాలకు పాల్పడలేదన్న మాజీ మంత్రి
  • ముఖ్యమంత్రి జిల్లాలో వరుసగా హత్యలు జరుగుతుంటే సమీక్ష జరపాలన్న శ్రీనివాస్ గౌడ్
రాయలసీమలో ఇప్పుడు ఫ్యాక్షనిజం బంద్ అయిందని... కానీ కొల్లాపూర్‌లో ప్రారంభమైందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో హత్యకు గురైన పార్టీ నాయకుడు శ్రీధర్ రెడ్డి కుటుంబాన్ని మాజీ మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురువారం పరామర్శించారు. అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లాలో దారుణాలకు పాల్పడుతోందన్నారు. చివరకు ప్రాణాలు తీసేవరకు వెళ్లిందన్నారు. ఎన్నికలు పూర్తైనప్పటి నుంచి ఇప్పటి వరకు ముగ్గురు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

చివరకు రాయలసీమలో కూడా ఇప్పుడు ప్రశాంతంగా ఉందన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే వారు జోరుగా ప్రచారం చేస్తున్నారని... కానీ తర్వాత కలిసి ముందుకు సాగుతున్నారన్నారు. కానీ కొల్లాపూర్‌లో మాత్రం కాంగ్రెస్ నేతలు అరాచకానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ ఇలాంటి దారుణాలకు పాల్పడలేదన్నారు.

తాము అభివృద్ధి పైనే దృష్టి సారించామన్నారు. అమాయకులను హత్య చేయించడం దారుణమన్నారు. ఇలాంటి పరిస్థితులు గ్రామాల నుంచి మండలాలకు పాకుతాయని హెచ్చరించారు. ముఖ్యమంత్రి జిల్లాలో వరుస హత్యలు జరుగుతున్నాయంటే సమీక్ష జరపాల్సిన బాధ్యత లేదా? అని నిలదీశారు. శ్రీధర్ రెడ్డి హత్యలో దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. సిట్ లేదా జ్యుడీషియల్ విచారణ జరిపించాలన్నారు.


More Telugu News