వచ్చే 75 ఏళ్లలో ఈ సిటీలు మాయం!
- భూగర్భ జలాలు తోడేయడంతో కుంగుతున్న భూమి
- గ్లోబల్ వార్మింగ్ తో మంచు కరిగి పెరుగుతున్న సముద్ర మట్టాలు
- తీరం వెంట ఉన్న చాలా నగరాలకు ముంపు ముప్పు
అసలే గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతోంది. అంటార్కిటికా, ఆర్కిటిక్ ప్రాంతాల్లో మంచు కరిగిపోతోంది. దీనితో సముద్ర జల మట్టాలు పెరిగిపోతున్నాయి. పర్యవసానంగా సముద్ర తీరం వెంట ఉన్న ప్రాంతాలు నీటిలో మునిగిపోయే పరిస్థితి ఏర్పడనుంది. కొన్ని దేశాలకు సంబంధించి ఇప్పటికే సముద్ర తీరంలో ఉన్న పెద్ద పెద్ద నగరాలు నీటి ముంపులో చిక్కుకుంటున్న పరిస్థితి మొదలైంది. ఇలాంటి నగరాలకు సంబంధించి ప్రపంచ ఆర్థిక వేదిక ఇటీవల ఓ నివేదిక విడుదల చేసింది. 2100 సంవత్సరం నాటికి.. అంటే వచ్చే 75 ఏళ్లలో మునిగిపోయే పెద్ద నగరాల జాబితా ఇచ్చింది. అవేమంటే..
- ఇండోనేషియా రాజధాని జకార్తా నగరం ఇప్పటికే నీటి ముంపు సమస్యను ఎదుర్కొంటోంది. సముద్ర మట్టం పెరగడం ఓవైపు, భూగర్భ జలాలను తోడేయడం వల్ల భూమి కుంగుతుండటం మరోవైపు దీనికి కారణమవుతున్నాయి. ఈ నగరం 2050 నాటికే చాలా వరకు మునిగిపోతుందట.
- నైజీరియాలోని లాగోస్ నగరం కూడా వేగంగా నీట మునిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
- భూగర్భ జలాలు విపరీతంగా తోడేయడం వల్ల అమెరికాలోని హ్యూస్టన్ నగరం కుంగుతోందట. ఈ సిటీ కూడా నీట మునిగిపోతుందట.
- ఇటలీలోని వెనీస్ కూడా మెల్లగా కుంగుతోంది. సముద్ర జలాలు పెరిగితే ఈ సిటీలోని చాలా ప్రాంతాలు నీట మునగడం ఖాయమట.
- అమెరికాలోని వర్జీనియా బీచ్, మియామీ ప్రాంతాలు కూడా ముంపు ముప్పులో ఉన్నాయని శాస్త్రవేత్తలు తేల్చారు.
- ఇదే దేశంలోని న్యూ ఓర్లీన్స్ నగరంలో కొన్ని ప్రాంతాలు ఇప్పటికే సముద్ర మట్టం కంటే దిగువకు వెళ్లిపోయాయట. 2100 సంవత్సరం నాటికి చాలా ప్రాంతాలు మునిగిపోతాయట.
- థాయిలాండ్ లోని బ్యాంకాక్ కూడా సముద్ర తీరంలోనే ఉంటుంది. ఇది కూడా మెల్లగా కుంగుతోందని అంటున్నారు.
- ఇక నెదర్లాండ్స్ లోని రోటర్డామ్, ఈజిప్ట్ లోని అలెగ్జాండ్రియా నగరాలు నీట మునిగే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.