అవినీతి చేయకుండానే కవితపై 8 వేల పేజీల ఛార్జిషీట్ దాఖలు చేశారా?: మంత్రి కోమటిరెడ్డి

  • కవిత జైలుకు వెళ్లిందనే ఫ్రస్ట్రేషన్‌లో రేవంత్‌పై కేటీఆర్ ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఆగ్రహం
  • లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుందని జోస్యం
  • కేటీఆర్‌కు బీఆర్ఎస్ఎల్పీ ఇస్తే హరీశ్ రావు కొత్త దుకాణం పెడతారని వ్యాఖ్య
ఎలాంటి అవినీతి చేయకుండానే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై 8 వేల పేజీల ఛార్జిషీట్‌ను దాఖలు చేశారా?  అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు. కవిత జైలుకు వెళ్లిందనే ఫ్రస్ట్రేషన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కేటీఆర్ మాటలు అసహ్యంగా ఉన్నాయన్నారు. రేవంత్ రెడ్డిని కేటీఆర్ ఎందుకు తిడుతున్నారని నిలదీశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినందుకా? లేక 30 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టినందుకా? ఎందుకు తిడుతున్నారని ప్రశ్నించారు. 

గురువారం ఆయన హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ దుకాణం బంద్ కావడం ఖాయమని జోస్యం చెప్పారు. జూన్ 5 తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తలే ఆ పార్టీ నేతలను వెంటపడి కొడతారన్నారు. కేసీఆర్ కుటుంబం రాష్ట్ర సంపదను దోచుకున్నది సరిపోక ఇంక ఢిల్లీకి కూడా వెళ్లిందని మద్యం పాలసీ కేసును ఉద్దేశించి విమర్శించారు. రేవంత్ రెడ్డికి భయపడి కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఎల్పీ బాధ్యతను కేటీఆర్‌కు ఇస్తే హరీశ్ రావు కొత్త దుకాణం పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పదేళ్లపాటు తెలంగాణను పాలించిన కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పుల రాష్ట్రాన్ని ఇచ్చారని మండిపడ్డారు. జిల్లాల్లో మున్సిపాలిటీల అనుమతులు లేకుండానే బీఆర్ఎస్ కార్యాలయాలు నిర్మించారని ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రుల భవనాలు 14 అంతస్తులకు మించరాదని నిబంధనలు ఉన్నాయని... కానీ ఎల్బీనగర్ ఆసుపత్రి స్థలానికి ఎన్‌వోసీ లేకుండా నిర్మాణం చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను తాము ప్రాధాన్యతా క్రమంలో నెరవేర్చుకుంటూ వెళతామన్నారు. వేసవిలో వడగళ్ల కారణంగా నష్టపోయిన రైతులకు రూ.1500 కోట్ల పరిహారం ఇచ్చామన్నారు. పేదలకు సన్నబియ్యం ఇవ్వాలనే సన్న వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పామని తెలిపారు. దొద్దు రకానికి బోనస్ ఇవ్వమని తాము చెప్పలేదన్నారు.


More Telugu News