రెండు గంటల్లో మాచర్ల వస్తానని సవాల్ చేసిన పిన్నెల్లి ఇప్పుడు ఎక్కడ దాక్కున్నాడో చెప్పాలి: జూలకంటి బ్రహ్మారెడ్డి

  • మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లి
  • పరారీలో సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే
  • పోలీసులే అతడికి సమాచారం అందించారన్న జూలకంటి
మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేట్ వద్ద ఓ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో నిందితుడైన సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారీలో ఉన్నారు. దీనిపై మాచర్ల నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి స్పందించారు. 

రెండు గంటల్లో మాచర్ల వస్తానని మొన్న ఒక వీడియోలో అసభ్య దూషణలు చేసిన పిన్నెల్లి, ఇప్పుడు ఎక్కడ దాక్కున్నాడో చెప్పాలని ఎద్దేవా చేశారు. రాష్ట్ర సరిహద్దుకు అటువైపు, ఇటువైపు అతడు పడిన తిప్పలు అన్నీ ఇన్నీ కావు... అతడు మాట్లాడిన మాటలకు దేవుడు సరైన స్క్రిప్టు విధించాడేమో అనిపిస్తోంది అంటూ వ్యంగ్యంగా అన్నారు.  

పోలీసుల సహకారంతోనే పిన్నెల్లి పారిపోయాడని, శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్న వ్యక్తి గోడలు దూకి పారిపోవడం కంటే నీచం ఇంకేం వుంటుందని జూలకంటి బ్రహ్మారెడ్డి వ్యాఖ్యానించారు. ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో అరెస్ట్ చేస్తారన్న సమాచారాన్ని పోలీసు శాఖలోనే కొంతమంది పిన్నెల్లికి తెలియజేయడంతో, అన్నదమ్ములిద్దరూ హడావిడిగా గోడలు దూకి పారిపోయారని ఆరోపించారు. 

ఐదు స్కార్పియోలతో ఒక వ్యక్తిని తొక్కించుకుంటూ పోతే 324 సెక్షన్ నమోదు చేశారని, ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉందా? అని బ్రహ్మారెడ్డి ప్రశ్నించారు. సంఘటనలోని వాస్తవాలను బట్టి కేసు నమోదు చేయాలని, కానీ పై నుంచి వచ్చిన సూచనలతో 324 సెక్షన్ కింద కేసు నమోదు చేశామని, అవసరమైతే సవరిస్తామని చెబుతున్నారని... తద్వారా తమపై ఒత్తిళ్లు ఉన్నాయని పోలీసులు చెప్పకనే చెప్పారని వివరించారు.


More Telugu News