కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఏపీ సీఎంను కలుస్తా: రేవంత్ రెడ్డి

  • కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం
  • రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని వెంకన్నను కోరుకున్నట్లు వెల్లడి
  • కొత్త సీఎంతో సత్సంబంధాలతో సమస్యలు పరిష్కరించుకుంటామని వివరణ
ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంతో తెలంగాణ సత్సంబంధాలను మెయింటెయిన్ చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఏపీ ముఖ్యమంత్రిని కలుసుకుంటానని వివరించారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటామని చెప్పారు. బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రయత్నించినా కుదరలేదని చెప్పారు. కొత్త బాధ్యతలు, స్థానిక పరిపాలన అంశాలతో వీలు చిక్కలేదన్నారు. రెండు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ముగియడంతో ఈ రోజు స్వామిని దర్శించుకున్నట్లు తెలిపారు.

రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని కోరుకున్నట్లు చెప్పారు. గతేడాది కొంత కరవు పరిస్థితి నెలకొన్నా ఈసారి మాత్రం వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, ప్రభుత్వానికి ప్రకృతి సహకరిస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు సామరస్యపూర్వకంగా, పరస్పరం సహకరించుకుంటూ అభివృద్ధిలో ముందుకు సాగాలని అభిప్రాయపడ్డారు. తిరుమలలో తెలంగాణ ప్రభుత్వం తరఫున సత్రం నిర్మించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రిని కలిసి దీనిపై చర్చిస్తామని చెప్పారు. తిరుమలలో సత్రంతో పాటు కుదిరితే కల్యాణమండపం కూడా నిర్మించి స్వామి వారి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు రేవంత్ రెడ్డి వివరించారు.



More Telugu News