పూణె యాక్సిడెంట్ కేసు.. మహారాష్ట్ర రవాణాశాఖ కీలక నిర్ణయం

  • నిందితుడైన బాలుడికి 25 ఏళ్లు వచ్చే వరకు డ్రైవింగ్ సర్టిఫికెట్ ఇవ్వకూడదని నిర్ణయం
  • కారుకు ఏడాది వరకు రిజిస్ట్రేషన్ చేయకుండా నిషేధం
  • కారుపై రూ. 1,758 పర్మినెంట్ రిజిస్ట్రేషన్ ఫీ పెండింగ్
మద్యం మత్తులో కారు డ్రైవ్ చేసి ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల మృతికి కారణమైన 17 ఏళ్ల బాలుడి విషయంలో మహారాష్ట్ర రవాణాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సదరు బాలుడికి 25 సంవత్సరాలు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేయకూడదని నిర్ణయిస్తూ, అతడు నడిపిన ఖరీదైన పోర్షే టేకాన్ కారుకు ఏ ఆర్టీవో కార్యాలయంలోనూ ఏడాదిపాటు రిజిస్ట్రేషన్ చేయకుండా నిషేధం విధించింది. మార్చి నుంచి కారు పర్మినెంట్ రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 1,758 పెండింగ్‌లో ఉందని రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్ వివేక్ భీమాన్వర్ తెలిపారు. మరోవైపు, బాలుడు మద్యం తాగిన బార్ నుంచి పోలీసులు రూ. 48 వేల బిల్లును సీజ్ చేశారు. 

ప్రమాదానికి కారణమైన పోర్షేకారును బెంగళూరుకు చెందిన డీలర్ దిగుమతి చేసుకున్నట్టు భీమాన్వర్ తెలిపారు. పూణె ఆర్టీవో కార్యాలయానికి కారును తీసుకొచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ మొత్తం చెల్లించలేదని గుర్తించినట్టు పేర్కొన్నారు. దీంతో తొలుత ఆ సంగతి చూడాలని కారు యజమానికి సూచించామని, ఆ తర్వాత తాత్కాలిక రిజిస్ట్రేషన్ కోసం పంపినట్టు చెప్పారు. అయితే, ఆ తర్వాత కారును రిజిస్ట్రేషన్ కోసం తీసుకురాలేదని పేర్కొన్నారు. బెంగళూరు డీలర్ మాత్రం ఆరు నెలల తాత్కాలిక రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌తో కారును యజమానికి అప్పగించినట్టు అధికారులు తెలిపారు. కాగా, ప్రమాదానికి గురైనప్పుడు కారు 160 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నట్టు మరో అధికారి తెలిపారు.


More Telugu News