వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు ముందు బంగ్లాదేశ్‌కు ప‌సికూన యూఎస్ షాక్‌!

  • హ్యూస్ట‌న్ వేదిక‌గా బంగ్లా, యూఎస్ మ‌ధ్య తొలి టీ20 మ్యాచ్‌
  • 5 వికెట్ల తేడాతో బంగ్లాను చిత్తు చేసిన అమెరికా
  • రాణించిన కోరె అండ‌ర్స‌న్ (34), హ‌ర్మీత్ సింగ్ (33)
  • హృదోయ్ అర్ధ శ‌త‌కం (58) వృథా
  • బంగ్లాపై అమెరికాకు ఇదే తొలి విజ‌యం 
టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ముందు అమెరికాలో ప‌ర్య‌టిస్తున్న బంగ్లాదేశ్‌కు ఆతిథ్య జ‌ట్టు గ‌ట్టి షాక్ ఇచ్చింది. హ్యూస్ట‌న్ వేదిక‌గా బంగ్లాతో జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ప‌సికూన యూఎస్ సంచ‌ల‌న విజ‌యం సాధించింది. బంగ్లాపై అమెరికాకు ఇదే తొలి విజ‌యం కావ‌డం విశేషం. 154 ప‌రుగుల ల‌క్ష్యాన్ని అమెరికా 19.3 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి ఛేదించింది. అమెరికా జ‌ట్టులో కోరె అండ‌ర్స‌న్ 25 బంతుల్లో 34 ప‌రుగులు చేయ‌గా, హ‌ర్మీత్ సింగ్ కేవ‌లం 13 బంతుల్లోనే 33 ర‌న్స్ బాదాడు. హ‌ర్మీత్ ఇన్నింగ్స్ లో 3 సిక్సులు, 2 ఫోర్లు ఉన్నాయి. ఆరో వికెట్‌కు ఈ ద్వ‌యం 62 ప‌రుగుల భాగ‌స్వామ్యం అందించ‌డం విశేషం. చివ‌రి వ‌ర‌కు క్రీజులో ఉండి జ‌ట్టును గెలిపించిందీ జోడీ. బంగ్లా బౌల‌ర్ల‌లో ముస్తాఫిజుర్ రెహ్మాన్ 2 వికెట్లు తీయ‌గా.. షోరిఫుల్ ఇస్లాం, ర‌షీద్ హుస్సేన్ త‌లో వికెట్ ప‌డ‌గొట్టారు. 

అంత‌కుముందు టాస్ గెలిచి బంగ్లాదేశ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది అమెరికా. దీంతో మొద‌ట బ్యాటింగ్ చేసిన బంగ్లా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల‌కు 153 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. బంగ్లా బ్యాట‌ర్ల‌లో హృదోయ్ అర్ధ శ‌త‌కం (58) తో రాణించాడు. సౌమ్య స‌ర్కార్ 20, మ‌హ్మ‌దుల్లా 31 ర‌న్స్ చేశారు. యూఎస్ బౌల‌ర్ల‌లో స్టీవెన్ టేల‌ర్ 2 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. సౌర‌భ్‌, అలీ ఖాన్‌, జెస్సీ సింగ్ చెరో వికెట్ తీశారు. అనంత‌రం 154 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌తో బ‌రిలోకి దిగిన అమెరికా అల‌వోక‌గా టార్గెట్‌ను అందుకుంది. 13 బంతుల్లో 33 ప‌రుగుల‌తో యూఎస్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన హ‌ర్మీత్ సింగ్ 'ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌'గా నిలిచాడు.


More Telugu News