ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్

  • ఇవాళ ఏసీపీ ఉమామహేశ్వరరావు నివాసంలో ఏసీబీ సోదాలు
  • మరో ఏడు చోట్ల కూడా సోదాలు
  • రూ.3 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం
  • ఏసీపీ ఉమామహేశ్వరరావును రేపు కోర్టులో ప్రవేశపెట్టనున్న ఏసీబీ
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇవాళ ఏసీపీ ఉమామహేశ్వరరావు నివాసంలో, ఆయనకు సంబంధించిన ప్రదేశాల్లో ఏకకాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిది చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహించింది. 

ఈ సందర్భంగా ఆయన అక్రమార్జనకు సంబంధించిన ఆధారాలు సేకరించిన ఏసీబీ అధికారులు... ఏసీపీ ఉమామహేశ్వరరావును ఆయన నివాసంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయనను అరెస్ట్ చేశామని ఏసీబీ జేడీ సుధీంద్ర బాబు వెల్లడించారు. ఆయనను రేపు కోర్టులో ప్రవేశపెడతామని తెలిపారు. 

సోదాల్లో 17 ఆస్తులు గుర్తించామని, ఘట్ కేసర్ లో ఐదు ప్లాట్స్, శామీర్ పేటలో విల్లా గుర్తించామని చెప్పారు. ఏసీపీ ఉమామహేశ్వరరావుకు చెందిన రెండు లాకర్లు గుర్తించామని పేర్కొన్నారు. రూ.38 లక్షల నగదు, 60 తులాల బంగారం సీజ్ చేశామని చెప్పారు. ఇప్పటివరకు మార్కెట్ విలువ ప్రకారం రూ.3 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నామని ఏసీబీ జేడీ వివరించారు.


More Telugu News