'పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఈవీఎంను ధ్వంసం చేసిన పిన్నెల్లి' అంటూ వీడియో విడుదల చేసిన టీడీపీ!

  • ఏపీలో మే 13న పోలింగ్
  • మాచర్ల నియోజకవర్గంలో ఉద్రిక్తతలు
  • ఓ పోలింగ్ బూత్ లో ప్రవేశించి ఈవీఎం పగులగొట్టిన పిన్నెల్లి
  • అడ్డుకోబోయిన ఓ వ్యక్తిని బెదిరించిన వైనం
  • వీడియో పంచుకున్న టీడీపీ
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓ పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించి ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోను తెలుగుదేశం పార్టీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. 

బూత్ లోకి ప్రవేశించిన పిన్నెల్లి... నేరుగా బ్యాలెట్ చాంబర్ వద్దకు వెళ్లి, ఈవీఎంను ఎత్తి నేలకేసి కొట్టిన దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. ఓ వ్యక్తి దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, ఎమ్మెల్యే పిన్నెల్లి అతడిని బెదిరిస్తూ బయటికి వెళ్లిపోయారు. ఇదంతా పోలింగ్ బూత్ లో ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాలో రికార్డయింది. 

దీనిపై టీడీపీ స్పందిస్తూ... ప్రజలు తమకు ఓట్లు వేయలేదని, జగన్ చేయని పాపం లేదని వ్యాఖ్యానించింది. పోలింగ్ రోజున మాచర్ల నియోజకవర్గంలోని పాల్వా గేట్ పోలింగ్ కేంద్రం (202)లో సాక్షాత్తు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు ధ్వంసం చేస్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజిలో రికార్డయ్యాయని వెల్లడించింది. 

ఒక పక్క ఈవీఎంల ధ్వంసం, మరో పక్క మారణహోమం చేసి ఏమీ తెలియనట్టు జగన్ రెడ్డి దేశం దాటిపోతే, ఈ పిల్ల సైకోలు రాష్ట్రం దాటి పారిపోయారని టీడీపీ పేర్కొంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ప్రతి ఒక్కరూ జూన్ 4 తర్వాత చట్టం ముందు దోషులుగా నిలబడక తప్పదని హెచ్చరించింది.


More Telugu News