ఏసీపీ ఉమామహేశ్వరరావు నివాసంలో ఏసీబీ సోదాలు... బయటపడుతున్న నోట్ల కట్టలు

  • గతంలో ఇబ్రహీంపట్నం ఏసీపీగా పనిచేసిన ఉమామహేశ్వరరావు
  • ప్రస్తుతం సీసీఎస్ ఏసీపీగా విధులు
  • అక్రమార్జనతో భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు
  • ఏకకాలంలో తెలుగు రాష్ట్రాల్లో 8 చోట్ల ఏసీబీ సోదాలు
హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై... ఏసీబీ అధికారులు తెలుగు రాష్ట్రాల్లో ఏకకాలంలో ఎనిమిది చోట్ల సోదాలు చేస్తున్నారు. 

హైదరాబాదులోని అశోక్ నగర్ లో ఉన్న ఉమామహేశ్వరరావు నివాసంలో, అదే అపార్ట్ మెంట్ లోని మరో రెండు ఫ్లాట్లలో, సీసీఎస్ ఆఫీసులోనూ, హైదరాబాదులోని మరో ఇద్దరు స్నేహితుల నివాసాల్లోనూ, ఏపీలో రెండు చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. దాదాపు 12 గంటలుగా సోదాలు నిర్వహిస్తుండగా, కట్టల కొద్దీ డబ్బు బయటపడుతోంది. 

ఇప్పటిదాకా జరిపిన సోదాల్లో రూ.40 లక్షల డబ్బు, విలువైన బంగారం, వెండి ఆభరణాలు, వివిధ ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

ఉమామహేశ్వరరావు గతంలో ఇబ్రహీంపట్నం ఏసీపీగా పనిచేశారు. ఆ సమయంలో అక్రమార్జనకు పాల్పడి భారీగా ఆస్తులు కూడబెట్టారని, ఇప్పుడు సీసీఎస్ లోనూ ఆయన పలు కేసుల్లో లంచాలు స్వీకరించారని ఆరోపణలు వచ్చాయి. 

కాగా, ఏసీపీ ఉమామహేశ్వరరావు నివాసంలో ఏసీబీ సోదాలు అంటూ మీడియాలో రావడంతో, బాధితులు ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. ఏసీపీ ఉమామహేశ్వరరావు బాధితులకు అండగా నిలవకుండా, నిందితులను కాపాడేందుకు ప్రయత్నిస్తుంటారని వారు ఏసీబీ అధికారులకు వివరించారు.


More Telugu News