తెలంగాణలో మళ్లీ 45 డిగ్రీలకు ఎండలు.. వేసవికి అదే ఎండ్‌కార్డ్

  • రేపటి నుంచి 24 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
  • వర్షాలు ఆగడంతో మళ్లీ ప్రతాపం చూపనున్న భానుడు
  • వేసవికి అదే చివరి దశ అవుతుందన్న వాతావరణ నిపుణుడు బాలాజీ
హైదరాబాద్ సహా తెలంగాణలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ప్రజలతో చెమటలు కక్కించిన భానుడు ప్రస్తుతం చల్లబడ్డాడు. అయితే, ఆమాత్రానికే మురిసిపోవద్దని, ఎండలు మళ్లీ గరిష్ఠానికి చేరుకుంటాయని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది. వర్షాలు ఆగిపోవడంతో ఉష్ణోగ్రతలు మళ్లీ పుంజుకుంటాయని తెలిపింది. అయితే, వచ్చే నాలుగు రోజులు మాత్రం నగరంలోని కొన్ని ప్రాంతాల్లో వాతావరణం మేఘావృతమై ఉంటుందని తెలిపింది.

ఎల్లుండి వరకు వర్షాలు పడే అవకాశం లేదని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో మాత్రం వర్షాలు పడతాయని తెలిపింది. రేపటి నుంచి 24 వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వివరించింది. 

వాతావరణాన్ని కచ్చితంగా అంచనా వేయడంలో ప్రసిద్ధి చెందిన వాతావరణ ఔత్సాహికుడు టి.బాలాజీ చెబుతున్న దాని ప్రకారం తెలంగాణలో ఉష్ణోగ్రతలు మళ్లీ 45 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉంది. దీంతో మళ్లీ వడగాలులు మొదలవుతాయి. వేసవిలో ఇదే చివరి దశ అవుతుందని బాలాజీ పేర్కొన్నారు.


More Telugu News