‘టీ’కి కూడా ఓ రోజు ఉందండోయ్!

  • ఏటా మే 21ని అంతర్జాతీయ టీ దినంగా పాటిస్తున్న ఐరాస
  • 2005 నుంచి కొనసాగుతున్న సంప్రదాయం
  • ప్రపంచవ్యాప్తంగా తేనీరు ప్రియుల మనసు దోచుకుంటున్న ఎన్నో రకాల ‘టీ’లు
పొద్దున్నే నిద్ర లేవగానే ఓ కప్పు టీ తాగనిదే చాలా మందికి వారి దినచర్య మొదలుకాదు. మనసును ఉత్తేజపరిచే తేయాకుల సువాసన, పాలతో కలపి సేవిస్తే వచ్చే కమ్మటి రుచికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. 

అందుకే మదర్స్ డే, ఫాదర్స్ డే లాగా ‘టీ’ని కూడా గౌరవించేందుకు ప్రత్యేకంగా ఓ రోజు కేటాయించారు. ఏటా మే 21వ తేదీని ‘ఇంటర్నేషనల్ టీ డే’గా ఐక్యరాజ్య సమితి పాటిస్తోంది. 

టీ సంస్కృతిపై ప్రపంచమంతా అవగాహన కల్పించేందుకు, ఆ పానీయానికి ఉన్న ఆర్థిక శక్తిని చాటేందుకు టీ డేను జరుపుతోంది. టీ బోర్డ్ ఆఫ్ ఇండియా చేసిన ప్రతిపాదనకు ఐక్యరాజ్య సమితి ఆమోదం తెలపడంతో 2005 నుంచి ఏటా ఇంటర్నేషనల్ టీ డేగా పాటిస్తోంది. 

ప్రపంచంలో మంచినీరు తర్వాత అత్యంత ప్రజాదారణ ఉన్న పానీయం తేనీరే కావడం విశేషం. ప్రస్తుతం వివిధ దేశాల్లో ఎన్నో రకాల టీ రుచులు తేనీరు ప్రియుల జిహ్వ చాపల్యాన్ని తీరుస్తున్నాయి.

మన దేశంలో మసాలా చాయ్, ఇరానీ చాయ్, లెమన్ టీ, అల్లం టీ, గ్రీన్ టీ బాగా ప్రజాదరణ పొందాయి. అలాగే జపాన్ లో మచ్చా, థాయ్ ల్యాండ్ లో చాయ్ యెన్, శ్రీలంకలో సిలోన్ బ్లాక్ టీ, మలేసియాలో తే తారిక్ వంటి టీ రకాలు బాగా ఫేమస్ అయ్యాయి.

టీ కేవలం మనసుకు ఆనందమే కాదు.. శరీరానికి ఆరోగ్యం కూడా అందిస్తోందండోయ్. రోజూ టీ తాగడం వల్ల శరీరంలో కొలెస్టరాల్ తగ్గుతుంది. అలాగే రక్తంలో గ్లూకోజ్ ను అదుపులో ఉంచుతుంది. గ్రీన్ టీ, బ్లాక్ టీ కేన్సర్ ముప్పును నివారిస్తాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతోంది.


More Telugu News