హెచ్ఐవీ తల్లులూ పాలివ్వొచ్చు.. దశాబ్దాలనాటి నిషేధాన్ని ఎత్తివేసిన అమెరికా

  • దశాబ్దాల నాటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటన
  • ప్రస్తుతం అందుబాటులో ఉన్న మందులు సంక్రమణకు అడ్డుకట్ట వేస్తున్నాయన్న డాక్టర్ లెసా అబౌగి
  • అమెరికాలో ప్రతి ఏటా బిడ్డలకు జన్మనిస్తున్న 5 వేల మంది హెచ్ఐవీ తల్లులు
హెచ్ఐవీ తల్లులు పిల్లలకు స్తన్యమివ్వడంపై ఉన్న నిషేధాన్ని అమెరికా ఎత్తివేసింది. ఈ మేరకు అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ప్రకటించింది. హెచ్ఐవీ వెలుగు చూసిన కొత్తలో అంటే 1980లలో విధించిన నిషేధాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. హెచ్ఐవీ కలిగిన తల్లులు పాలిస్తే శిశువుల్లోకి వైరస్ జొరబడి వారిని కూడా హెచ్ఐవీ రోగులుగా మారుస్తుందన్న ఉద్దేశంతో అప్పట్లో పిల్లలకు పాలివ్వడాన్ని నిషేధించారు. 

అయితే, ఇప్పుడు మెరుగైన చికిత్సా విధానాలు, మందులు అందుబాటులోకి రావడంతో నిషేధాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. హెచ్ఐవీ తల్లులు మందులు వాడుతున్నంత కాలం పిల్లలకు పాలివ్వొచ్చని స్పష్టం చేసింది. వారు తీసుకుంటున్న మందులు తల్లుల ద్వారా బిడ్డకు వైరస్‌ను చేరవేసే ముప్పును ఒక శాతానికే పరిమితం చేస్తాయని, కాబట్టి వారు నిరభ్యంతరంగా పిల్లలకు పాలు పట్టవచ్చని కొలరాడో యూనివర్సిటీ లీడ్ ఆథర్, హెచ్ఐవీ నిపుణురాలు డాక్టర్ లెసా అబౌగి తెలిపారు.

దశాబ్ద కాలం క్రితం హెచ్ఐవీకి విస్తృత చికిత్స, మందులు అందుబాటులోకి వచ్చాయి. అంతకుముందు మాత్రం తల్లిపాల ద్వారా 30 శాతం మంది చిన్నారులకు హెచ్ఐవీ సంక్రమించేదని డాక్టర్ లెసా తెలిపారు. ప్రస్తుతం అది ఒకశాతం లో‌పే ఉండడంతో చిన్నారులకు వచ్చే ప్రమాదం ఏమీ లేదని వివరించారు. 1990లలో అమెరికాలో ప్రతి సంవత్సరం 2 వేల మంది హెచ్ఐవీ బారినపడేవారని పేర్కొన్నారు. ఇప్పుడా సంఖ్య 30 కంటే తక్కువే ఉందని తెలిపారు. 

అమెరికాలో ప్రతి సంవత్సరం దాదాపు 5 మంది హెచ్ఐవీ మహిళలు బిడ్డలకు జన్మనిస్తున్నారు. ఎయిడ్స్‌కు దారితీసే హెచ్ఐవీని అరికట్టే మందులు ఇప్పుడు విస్తృతంగా అందుబాటులోకి రావడంతో సంక్రమణ స్థాయి గణనీయంగా తగ్గింది.


More Telugu News