గంభీర్‌తో జాగ్రత్త.. సీనియర్ ప్లేయర్లకు ఆకాశ్‌చోప్రా హెచ్చరిక

  • గంభీర్ పెద్దన్నలా ఉంటాడని అనుకోవద్దన్న ఆకాశ్ 
  • కఠినమైన తండ్రిలా ఉంటాడని, ప్లేయర్లు కూడా అలాగే మసలుకోవాల్సి ఉంటుందన్న గౌతీ
  • అతడిది ముక్కుసూటి మనస్తత్వమని, కచ్చితంగా ఉంటాడని ప్రశంస
టీమిండియా తదుపరి హెడ్‌కోచ్‌గా గంభీర్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉండడంతో సీనియర్ ఆటగాళ్లను మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా హెచ్చరించాడు. గంభీర్‌ది ముక్కుసూటి మనస్తత్వమని, జట్టును ఎలా నిర్మించాలో అతడికి తెలుసని పేర్కొన్నాడు. గంభీర్‌ కనుక వేలానికి వస్తే తాను అత్యధిక రేటు కడతానని పేర్కొన్న చోప్రా భారత జట్టులో మాత్రం అలాంటి వేలాలు ఉండవని పేర్కొన్నాడు. గంభీర్ బలమైన వ్యక్తిత్వం ఉన్నవాడని ప్రశంసించాడు.

2007 టీ20 ప్రపంచకప్‌ను భారత్ గెలవడంలో ముఖ్యపాత్ర పోషించిన గంభీర్.. ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్లకు మెంటార్‌గా ప్రశంసనీయ పాత్ర పోషించాడని తెలిపాడు. గంభీర్ కోచ్ అయితే కఠినమైన తండ్రిలా ఉంటాడని, కాబట్టి సీనియర్ ఆటగాళ్లు జాగ్రత్తగా ఉండాల్సిందేనని హెచ్చరించాడు. 

జట్టుకు కొత్త కెప్టెన్ వచ్చినప్పుడు ఎలాంటి మార్పులైతే ఉంటాయో, కోచ్ వచ్చనప్పుడూ అంతేనని చోప్రా తెలిపాడు. గౌతీ పని విధానం దాదాపు స్ట్రిక్ట్ ఫాదర్‌లా ఉంటుందని పేర్కొన్నాడు. తండ్రి కఠినంగా ఉన్నప్పుడు పిల్లలు ఎలా అయితే మసలుకుంటారో సీనియర్లు కూడా అలాగే జాగ్రత్తగా ఉండాలని జాగ్రత్తలు చెప్పాడు. సీనియర్లేమో పెద్దన్నలా ఉండాలని అనుకుంటారని, కానీ గంభీర్‌తో అలా ఆశలు పెట్టుకోవద్దని సూచించాడు. 

ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో గౌతం గంభీర్ ను ఇప్పటికే సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి.


More Telugu News