ఆర్సీబీ స్టార్ యశ్ దయాల్ తండ్రి భావోద్వేగ వ్యాఖ్యలు

  • ఐపీఎల్-2023లో పేలవ ప్రదర్శన చేయడంతో యశ్ దయాల్‌పై దారుణమైన ట్రోలింగ్
  • రింకూ సింగ్ ఒకే ఓవర్‌లో 5 సిక్సర్లు కొట్టడంతో అవమానాలు, అవహేళనలు ఎదుర్కొన్న ఆర్సీబీ పేసర్ 
  • ఆ పరిస్థితులను గుర్తుచేసుకున్న అతడి తండ్రి చంద్రపాల్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సంచలన రీతిలో చెన్నై సూపర్ కింగ్స్‌పై గెలిచి ప్లే ఆఫ్స్ చేరిన విషయం తెలిసిందే. ఆర్సీబీ ఆటగాళ్లందరూ సమష్టిగా రాణించారు. ముఖ్యంగా చివరి ఓవర్ సంధించిన పేసర్ యశ్ దయాల్ మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. క్రీజులో ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా ఉన్నప్పటికీ చక్కటి బంతులు వేసి వారిద్దరిని నిలువరించాడు. దీంతో ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించిన యశ్ దయాల్ ఆ జట్టు ఫ్యాన్స్‌కు హీరోగా మారిపోయాడు. ఇప్పుడైతే స్టార్‌గా మారిపోయాడు కానీ గతేడాది ఐపీఎల్-2023 సీజన్‌లో అతడు కఠిన పరీక్షను ఎదుర్కొన్నాడు. అవమానాలు, అవహేళనలను చవిచూశాడు.

యశ్ దయాల్ గతేడాది గుజరాత్ టైటాన్స్‌‌కు ఆడాడు. అంతగా రాణించలేకపోయాడు. మరీ ముఖ్యంగా కోల్‌కతా వర్సెస్ గుజరాత్ మ్యాచ్‌లో యశ్ దయాల్ వేసిన చివరి ఓవర్‌లో యువ సంచలనం రింకూ సింగ్ ఏకంగా 5 భారీ సిక్సర్లు బాదాడు. దీంతో కోల్‌కతా సంచలన రీతిలో విజయం సాధించడంతో, యశ్ దయాల్‌పై విపరీతమైన నెగిటివ్ ట్రోలింగ్ నడిచింది. అవహేళన చేస్తూ చాలా పోస్టులు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.

మరుసటి ఏడాది అంటే ఐపీఎల్ 2024కు ముందు యశ్ దయాల్‌ను గుజరాత్ టైటాన్స్ వదులుకుంది. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అతడిని అనూహ్యంగా రూ.5 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. అప్పుడు కూడా యశ్ దయాల్‌కు అవమానాలే ఎదురయ్యాయి. ‘ఆర్సీబీ రూ.5 కోట్లు వ్యర్థం’ అంటూ దుష్ప్రచారం చేశారు. అయితే గత శనివారం చెన్నై సూపర్ కింగ్స్‌పై చక్కటి బౌలింగ్‌తో ఆర్సీబీని గెలిపించడం ద్వారా తన సత్తా ఏంటో యశ్ దయాల్ చాటిచెప్పాడు.

దయాల్ తండ్రి భావోద్వేగం
ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరడంలో యశ్ దయాల్ కీలక పాత్ర పోషించడంపై అతడి తండ్రి చంద్రపాల్ భావోద్వేగంగా స్పందించారు. ఐపీఎల్-2023 సమయంలో దయాల్ ఎదుర్కొన్న పరిస్థితులను గుర్తుచేసుకున్నాడు. దయాల్‌ను అవహేళన చేయడం తమ కుటుంబం ప్రత్యక్షంగా చూసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఒక వాట్సాప్ గ్రూప్‌లో తనకు పరిచయం ఉన్న ఒక వ్యక్తి దయాల్‌ని ఎగతాళి చేస్తూ ఒక ఫొటో షేర్ చేశాడని, ప్రారంభించకుండానే ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ కథ (దయాల్ ఉత్తరప్రదేశ్ ప్లేయర్) ముగిసిందంటూ చులకనగా మాట్లాడాడని ప్రస్తావించారు. అవమానాలు, అవహేళనలు ఎదురైనప్పటికీ దయాల్ ఆగిపోలేదని చెప్పారు. దారుణమైన ట్రోలింగ్ చేస్తుండడంతో తమ కుటుంబానికి సంబంధించిన వాట్సప్ గ్రూప్ మినహా అన్నింటి నుంచి వైదొలిగామని చంద్రపాల్ గుర్తుచేసుకున్నారు. యశ్ దయాల్‌ని ఆర్సీబీ రూ.5 కోట్లకు కొనుగోలు చేసినప్పుడు కూడా ఫ్రాంచైజీ రూ.5 కోట్లు మురుగు కాలువలో పోసిందంటూ ఎగతాళి చేశారని చంద్రపాల్ గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు ఆయన ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.


More Telugu News