మీడియా ప్రతినిధులను భయపెట్టే చర్యలు సరికావు: నాదెండ్ల మనోహర్

  • విశాఖపట్నం బర్మా కాలనీలో సుంకర ధనలక్ష్మి కుటుంబంపై దాడి
  • బాధితుల వేదనను మీడియాలో ప్రసారం చేస్తే కేసులు పెట్టడం ఏంటన్న నాదెండ్ల
  • ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రతినిధులపై కేసులు అసమంజసం అని విమర్శలు
విశాఖపట్నం బర్మా కాలనీలో సుంకర ధనలక్ష్మి కుటుంబంపై దాడి ఘటనలో బాధితులు చెప్పిన విషయాలను, వారు చేసిన ఆరోపణలను మీడియాలో ప్రసారం చేయడాన్ని నేరంగా పరిగణించడం అప్రజాస్వామికం అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. బాధితుల వేదనను ప్రసారం చేయడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. 

"బాధితులెవరైనా, బాధించేది ఎవరైనా నిర్భయంగా ప్రజలకు తెలియజేయడం మీడియా బాధ్యత. వాక్ స్వాతంత్ర్యపు హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛను అనుసరించి వార్తలను, జరుగుతున్న పరిణామాలను, మీడియా సమాజానికి చేరవేస్తూ ఉంటుంది. 

కానీ విశాఖ ఘటన నేపథ్యంలో ఈనాడు, ఆంధ్రజ్యోతిపైనా, వాటి ప్రతినిధులపైనా కేసులు నమోదు చేయడం అసమంజసం. వైసీపీ పాలన మొదలైనప్పటి నుంచి రాష్ట్రంలో మీడియాకు రకరకాల రాజకీయ రంగు పులిమి వర్గాలుగా విభజించారు. మీడియా నియంత్రణకు జీవో నెం.1 తీసుకువచ్చారు. 

బాధితులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించినందుకు విశాఖ నార్త్ నియోజకవర్గం కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజుపైనా కేసు నమోదు చేయడం చూస్తే, ఈ కేసులు పూర్తిగా రాజకీయ ప్రేరేపితం అని అర్థమవుతోంది. 

సుంకర ధనలక్ష్మి కుటుంబంపై దాడి చేసిన వారెవరో, అందుకు గల కారణాలు ఏమిటో పోలీసులు ప్రజల ముందు పెట్టాలి. ఎన్నికల అనంతరం జరిగిన హింసగా పరిగణించి ప్రత్యేక విచారణ చేయించాలి" అని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.


More Telugu News