చివరి రోజుల్లో నా తల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందారు: ప్రధాని మోదీ

  • 'మోదీ బ్రాండ్' మీద స్పందించిన ప్రధానమంత్రి
  • బ్రాండ్ అంటే ఏమిటి? అది ఎలా పని చేస్తుంది? తనకు తెలియదని వ్యాఖ్య
  • ప్రజలు తన జీవితం, పనితీరును చూస్తున్నారన్న మోదీ
100 ఏళ్లకు పైగా జీవించిన తన తల్లి చివరి రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తన తల్లి సాధారణ జీవితం గడిపిందన్నారు. 'మోదీ బ్రాండ్' మీద ఆయన పైవిధంగా స్పందించారు. సోమవారం ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... అసలు బ్రాండ్ అంటే ఏమిటో... అది ఎలా పని చేస్తుందో తనకైతే తెలియదన్నారు. ప్రజలు మాత్రం తన జీవితాన్ని, పని తీరును చూస్తున్నారని తెలిపారు.

తాను 13 సంవత్సరాలు గుజరాత్ సీఎంగా ఉన్నానని... పదేళ్ళుగా ప్రధానిగా ఉంటున్నానని పేర్కొన్నారు. కానీ తన తల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందారన్నారు. అలాంటప్పుడు దేశానికి బ్రాండ్ అవసరం లేదన్నారు. తన జీవితం కొంతవరకు భిన్నంగా ఉంటుందని అర్థం చేసుకోవచ్చునన్నారు.

సీఎంగా ఉన్నప్పుడే తనకు 250కి పైగా దుస్తులు ఉన్నాయని మాజీ సీఎం అమర్ సింహ చౌధరి ఆరోపించారని గుర్తు చేసుకున్నారు. తనపై చేసిన ఆ ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. అయినప్పటికీ, రూ.250 కోట్లు దోచుకునే సీఎం కావాలా? 250 జతల దుస్తులు ఉన్న ముఖ్యమంత్రి కావాలా? అని తాను ప్రజల ముందుకు వెళ్లానని తెలిపారు. అలాంటి సమయంలో ప్రజలు తనకే ఓటు వేశారన్నారు.


More Telugu News