టీడీపీ ముసుగులో తప్పుడు ప్రచారం చేస్తున్నాడు: వర్ల రామయ్య

  • టీడీపీ కార్యకర్త వేషంలో ఓ వ్యక్తి మాట్లాడుతున్న వీడియోపై టీడీపీ ఫిర్యాదు
  • నేడు లా అండ్ ఆర్డర్ డీఐజీని కలిసిన వర్ల రామయ్య, తదితరులు
  • టీడీపీకి చెడ్డపేరు తెచ్చేలా మాట్లాడుతున్నాడని ఫిర్యాదు
  • అతడి పేరు రామాల మన్విత్ కృష్ణారెడ్డి అని, కడపకు చెందినవాడని వెల్లడి
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, ఇతర నేతలు ఇవాళ లా అండ్ ఆర్డర్ డీఐజీ సెంథిల్ కుమార్ ను కలిశారు. ఓ వ్యక్తి టీడీపీ కార్యకర్త వేషంలో టీడీపీకి నష్టం కలిగించేలా తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఫిర్యాదు చేశారు. 

అనంతరం వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ, ఈ చెత్త వెధవ టీడీపీ ముసుగులో అసత్య ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. 

ఐదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వంలో మీకు పథకాలన్నీ వచ్చేటప్పటికీ ఒళ్లు తెలియకుండా ఉంది... మేం (టీడీపీ) అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ స్కూళ్లను రద్దు చేసేస్తాం... స్కూళ్లకు పసుపు రంగులు వేసి మిమ్మల్ని బయటికి తోలతాం... ఎస్సీ బీసీలకు వచ్చేవి రద్దు చేస్తాం, నాడు-నేడు మీకు అవసరమంట్రా... మంగలోళ్లు మంగలి పనిచేసుకోండి, ఎవడి పని వాడు చేసుకోండి...  మీరేందిరా అమెరికా వెళ్లేది... మేం రా అమెరికా వెళ్లేది, మేం రా పెద్దవాళ్లం కావాల్సింది... కంపెనీలు పెట్టాల్సింది, ఉద్యోగాలు చేయాల్సింది మేం రా... అంటూ ఆ వ్యక్తి మాట్లాడిన వీడియోను వర్ల రామయ్య మీడియాకు ప్రదర్శించారు. 

"ఈ వెధవ టీడీపీ వేషంలో తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. వీడు వైసీపీ నాయకుడు... వీడి పేరు రామాల మన్విత్ కృష్ణారెడ్డి... వీడు కడపకు చెందినవాడు. ఇంతకంటే తప్పుడు తనం ఇంకేదైనా ఉందా? జగన్ మోహన్ రెడ్డి గారూ... ఏమిటి మీ పార్టీ బ్రతుకు? జగన్ మోహన్ రెడ్డి గారూ... ఎవడీ చెత్త వెధవ? మీ వాడు కాదా, మీ పార్టీ వాడు కాదా? ఈ విధంగా మోసం చేసి బతుకుతారా? మీ పార్టీ బతుకుంతా అంతేనా? 

మేం ఇదే అంశాన్ని లా అండ్ ఆర్డర్ డీఐజీ సెంథిల్ కుమార్ కు వివరించాం. ఆయన ఆశ్చర్యపోయారు. ఆయన ఆ వీడియో అంతా విన్నారు. వెంటనే కేసు పెట్టి ఆ వెధవ ఎక్కడున్నా లోపల పడేస్తానని అన్నారు. 

ఇదే వెధవపై మేం గతంలో రెండు ఫిర్యాదులు చేశాం. సీఐడీ డీజీ సంజయ్ కుమార్ కు ఫిర్యాదు చేశాం. ఆయన కథలు బాగా చెబుతారు! మాటలు బాగా చెబుతాడు... మీడియా వాళ్లతో కూడా భలే మాట్లాడతాడు... పని మాత్రం చేయడు... అతడొక దద్దమ్మ పోలీసు అధికారి... మేం రెండు సార్లు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు. కానీ ఇవాళ లా అండ్ ఆర్డర్ డీఐజీ సెంథిల్ కుమార్ మాత్రం వెంటనే స్పందించారు" అంటూ వర్ల రామయ్య వివరించారు.


More Telugu News