మోదీ మరోసారి ప్రధాని అయితే రిజర్వేషన్లు తొలగిస్తారని అసత్య ప్రచారం చేస్తున్నారు: అమిత్ షా

  • పార్లమెంట్‌లో బీజేపీ ఉన్నంత వరకు రిజర్వేషన్లను ఏ ఒక్కరూ కదిలించలేరన్న అమిత్ షా
  • ఎన్నికల తర్వాత బైనాక్యులర్‌తో వెతికినా కాంగ్రెస్ కనిపించదని ఎద్దేవా
  • బుజ్జగింపు రాజకీయాల కోసమే కాంగ్రెస్ ఆర్టికల్ 370ని రద్దు చేయలేదని విమర్శ
లోక్ స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ విజ‌యం సాధించి న‌రేంద్ర మోదీ మ‌రోసారి ప్రధాని అయితే రిజ‌ర్వేష‌న్ల‌ను తొల‌గిస్తార‌ని కాంగ్రెస్ అస‌త్య ప్రచారం చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా సోమ‌వారం హర్యానాలోని ఝ‌జ‌ర్‌లో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడుతూ... పార్ల‌మెంట్‌లో బీజేపీ ఉన్నంత‌వ‌ర‌కూ రిజ‌ర్వేష‌న్ల‌ను ఏ ఒక్క‌రూ క‌దిలించ‌లేర‌న్నారు.

ఎన్నిక‌ల‌కు ముందు రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర చేప‌ట్టార‌ని ఎన్నిక‌ల అనంత‌రం బైనాక్యుల‌ర్స్‌తో వెతికినా కాంగ్రెస్ క‌నిపించ‌ద‌ని ఎద్దేవా చేశారు. కాషాయ పార్టీ రాజ్యాంగాన్ని మార్చివేస్తుంద‌ని, రిజ‌ర్వేష‌న్లు ర‌ద్దు చేస్తుంద‌ని కాంగ్రెస్ దుష్ప్ర‌చారం సాగిస్తోంద‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

బుజ్జగింపు రాజకీయాల కోసమే ఆర్టికల్ 370ని రద్దు చేయలేదు

కాంగ్రెస్ పార్టీ ఆరు దశాబ్దాలుగా అధికారంలో ఉన్నప్పటికీ బుజ్జగింపు రాజకీయాల కోసమే ఆర్టికల్ 370ని రద్దు చేయలేదని విమర్శించారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం పెరిగినా కాంగ్రెస్ ఆర్టికల్‌ను రద్దు చేయలేదన్నారు. పీవోకే కచ్చితంగా మనదేనని.. దానిని వెనక్కి తీసుకుంటామని పునరుద్ఘాటించారు. మైనార్టీ ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకునేందుకు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వంటి అగ్రనేతలు అయోధ్య బాలరాముడి ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనలేదన్నారు.

'మీరంతా 2019లో నరేంద్ర మోదీని రెండోసారి ప్రధానిగా చేశారు. దీంతో ఆగస్టు 5, 2019న, మోదీ ఆర్టికల్ 370ని రద్దు చేశారు. ఇప్పుడు మన త్రివర్ణ పతాకం కశ్మీర్‌లో సగర్వంగా రెపరెపలాడుతోందని వ్యాఖ్యానించారు. మల్లికార్జున ఖర్గేకు 80 ఏళ్లు వచ్చాయని... కానీ ఆయన ఇంకా మన దేశాన్ని అర్థం చేసుకోలేదని విమర్శించారు. హర్యానా యువత కశ్మీర్ కోసం ప్రాణాలు అర్పించగలరన్నారు.


More Telugu News