ముంబై ఇండియ‌న్స్‌ ఆట‌గాళ్ల‌కు నీతా అంబానీ కీల‌క సందేశం.. వైర‌ల్ వీడియో!

  • ఈసారి ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్ ఘోర‌ ప్ర‌ద‌ర్శ‌న
  • లీగ్ ద‌శ నుంచే ఇంటిదారి ప‌ట్టిన ముంబై  
  • 2024 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ కోసం ఎంఐ నుంచి న‌లుగురు ప్లేయ‌ర్లకు చోటు
  • పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌కు ఎంపికైన‌ రోహిత్‌, హార్దిక్‌, సూర్య‌, బుమ్రా
  • ఈ న‌లుగురికి 'ఆల్ ది బెస్ట్' చెప్పిన నీతా అంబానీ
ఈసారి ఐపీఎల్‌లో ఐదుసార్లు ఛాంపియ‌న్ అయిన ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు ఘోర‌మైన ప్ర‌ద‌ర్శ‌న కార‌ణంగా లీగ్ ద‌శ నుంచే ఇంటిముఖం ప‌ట్టింది. ఆడిన 14 మ్యాచుల్లో కేవ‌లం నాలుగింటిలోనే విజ‌యం సాధించింది. దీంతో పాయింట్ల ప‌ట్టిక‌‌లో అట్ట‌డుగున నిలిచింది. కెప్టెన్సీ మార్పు ఆ జ‌ట్టుపై తీవ్ర ప్ర‌భావాన్ని చూపించింద‌నేది క్రీడా విశ్లేష‌కుల మాట‌. కొత్త సార‌ధి హార్దిక్ పాండ్యా జ‌ట్టును న‌డిపించ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు. వ్య‌క్తిగ‌తంగానూ పాండ్యా రాణించ‌లేక‌పోయాడు. గుజ‌రాత్ టైటాన్స్ (జీటీ) ను రెండుసార్లు ఫైన‌ల్‌కి తీసుకెళ్లిన అత‌డు.. ముంబైకి వ‌చ్చేసరికి కెప్టెన్‌గా పూర్తిగా తేలిపోయాడు. దీంతో ముంబైకి ఈ సీజ‌న్‌లో ఘోర ప‌రాభ‌వం త‌ప్ప‌లేదు. 

ఇదిలాఉంటే.. వ‌చ్చే నెల‌లో జ‌రగ‌నున్న‌ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ కోసం ముంబై జ‌ట్టు నుంచి న‌లుగురు ప్లేయ‌ర్లు ఎంపిక‌యిన విష‌యం తెలిసిందే. రోహిత్ శ‌ర్మ‌, సూర్య‌కుమార్ యాద‌వ్‌, హార్దిక్ పాండ్యా, జ‌స్ప్రీత్ బుమ్రా పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌కు సెల‌క్ట్ అయ్యారు. హిట్‌మ్యాన్ సార‌థ్యంలోనే టీమిండియా వ‌ర‌ల్డ్‌క‌ప్ ఆడ‌నుంది. ఈ క్ర‌మంలో త‌మ జ‌ట్టు స‌భ్యుల‌కు ఎంఐ ఓన‌ర్ నీతా అంబానీ కీల‌క సందేశం ఇచ్చారు. 

నీతా అంబానీ మాట్లాడుతూ.. "ఈ ఐపీఎల్ సీజ‌న్ మ‌న‌కు చాలా నిరుత్సాహ‌క‌రంగా ముగిసింది. మ‌నం అనుకున్న విధంగా అన్నీ జ‌ర‌గ‌వు. ఇప్ప‌టికీ నేను ముంబై ఇండియ‌న్స్‌కు అతిపెద్ద అభిమానిని. ఈ జ‌ట్టు జెర్సీని ధ‌రించ‌డాన్ని గౌర‌వంగా భావిస్తా. ఈ సీజ‌న్‌లో మ‌నం ఎక్క‌డ వెనుక‌బ‌డ్డామో త‌ర్వాత స‌మీక్షించుకుందాం. త‌ప్ప‌కుండా భ‌విష్య‌త్తులో బ‌లంగా ముందుకొస్తాం. 

జాతీయ జ‌ట్టు త‌ర‌ఫున టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ ఆడేందుకు సిద్ధ‌మ‌వుతున్న ఆట‌గాళ్ల‌కు ఆల్ ది బెస్ట్‌. రోహిత్‌, హార్దిక్‌, సూర్య‌, బుమ్రా.. మీ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో భార‌తీయుల‌ను ఆనంద‌ప‌రుస్తార‌ని ఆశిస్తున్నా. టీమిండియా టోర్నీ విజేత‌గా నిలిచి వ‌ర‌ల్డ్‌క‌ప్ టైటిల్‌తో రావాల‌ని కోరుకుంటున్నా" అని నీతా అంబానీ అన్నారు. 

ఇదిలాఉంటే.. జూన్ 1వ తేదీ నుంచి అమెరికా, విండీస్ వేదిక‌గా 2024 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ప్రారంభం కానుంది. ఈసారి ఈ మెగా టోర్నీలో మొత్తం 20 దేశాలు పాల్గొంటున్నాయి. ఇందులో భార‌త్ త‌న మొద‌టి మ్యాచ్‌ను జూన్ 5న ఐర్లాండ్‌తో ఆడ‌నుంది. ఆ త‌ర్వాత 9న న్యూయార్క్‌లో దాయాది పాకిస్థాన్‌తో త‌ల‌ప‌డ‌నుంది. అలాగే జూన్ 12న అమెరికా, జూన్ 15న కెన‌డాతో టీమిండియా త‌న లీగ్ మ్యాచులు ఆడ‌నుంది.


More Telugu News