తిరుమ‌ల వెళ్తున్నారా? అయితే ఇది తెలుసుకోండి!

  • వేస‌వి సెల‌వులు కావ‌డంతో తిరుమ‌ల‌కు పెరిగిన భ‌క్తుల తాకిడి
  • గత మూడు రోజులుగా కొండపై కొనసాగుతున్న రద్దీ
  • ప్రస్తుతం కృష్ణ తేజ గెస్ట్ హౌస్ సర్కిల్ వరకు క్యూ లైన్ల‌లో భ‌క్తులు
  • శ్రీవారి దర్శనానికి దాదాపు 16 గంటల సమయం
పిల్ల‌ల‌కు వేస‌వి సెల‌వులు కావ‌డంతో త‌ల్లిదండ్రులు వారిని టూర్ల‌కు, ఆధ్యాత్మిక ప్ర‌దేశాల‌కు తీసుకెళ్ల‌డం చేస్తున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకోవ‌డం కామ‌న్‌. అందులో భాగంగా ఎక్కువ మంది తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నానికి వెళ్తుంటారు. ఒక‌వేళ మీరు కూడా అదే ప్లాన్ లో ఉంటే మాత్రం మీరు త‌ప్ప‌కుండా ఈ విష‌యం తెలుసుకోవాల్సిందే. 

అస‌లు విష‌యం ఏమిటంటే.. తిరుమ‌ల స్వామివారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటార‌నే విష‌యం తెలిసిందే. ఈ క్రమంలోనే శ్రీనివాసుడిని దర్శించుకునే భక్తుల సంఖ్య బాగా పెరిగింది. దీంతో ప్ర‌స్తుతం తిరుమలలో రద్దీ కొన‌సాగుతోంది. గత మూడు రోజులుగా కొండపై కొనసాగుతున్న రద్దీ.. ఆదివారం, సోమవారం కూడా కంటిన్యూ అయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులతో పాటు వీకెండ్ కావడంతో తిరుమలకు భక్తుల తాకిడి భారీగా పెరిగింది. 

కాగా, తిరుప‌తిలో ప్ర‌తియేటా మే నెలలో కచ్చితంగా భక్తుల రద్దీ అధికంగానే ఉంటుంది. ఇక శుక్ర, శని, ఆదివారాలు కావడంతో ఇది మరింత పెరిగింది. ఇవాళ (సోమవారం) కూడా రద్దీ అలాగే కొనసాగుతోందని స‌మాచారం. ప్రస్తుతం కృష్ణ తేజ గెస్ట్ హౌస్ సర్కిల్ వరకు భ‌క్తులు క్యూ లైన్ల‌లో స్వామివారి ద‌ర్శ‌నం కోసం వేచి చూస్తున్నారు. దీంతో శ్రీవారి దర్శనానికి దాదాపు 16 గంటల సమయం పడుతోంది. కావున‌ తిరుమల వెళ్లాలనుకునే భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేసుకోవ‌డం మంచిది.

ఇక భారీగా పెరిగిన భ‌క్తుల రాక‌ దృష్ట్యా టీటీడీ ఈఓ ధర్మారెడ్డి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అలాగే అన్నప్రసాదం, ఇంజినీరింగ్‌, ఆరోగ్యం, విజిలెన్స్‌, వైద్య శాఖల ఉన్నతాధికారులు కూడా భక్తుల సౌకర్యాలను, క్యూ లైన్లను నిరంతరాయంగా కొనసాగేలా త‌గిన‌ చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. కాగా, తిరుమలలో శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ మహోత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి.


More Telugu News