పల్నాడు అరాచకాలపై వైసీపీ తప్పుడు ప్రచారం: లావు శ్రీకృష్ణ దేవరాయలు

  • ఎస్పీ కుటుంబానికి, మా కుటుంబానికి స్నేహం ఉందన్నట్లు వ్యాఖ్యలు
  • కాల్ డేటా ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించిన లావు  
  • వాస్తవాలను బయటపెట్టాలని సిట్ దర్యాఫ్తు బృందానికి విజ్ఞప్తి
  • సోమవారం టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో లావు శ్రీకృష్ణ దేవరాయలు మీడియా సమావేశం
పల్నాడులో ఎన్నికల సందర్భంగా జరిగిన అరాచకాలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిజానిజాలు బయటపెట్టాలంటూ టీడీపీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు సిట్ అధికారులను కోరారు. కాల్ డేటా ఇచ్చేందుకు తాము సిద్ధమని, వైసీపీ నేతల కాల్ డేటా కూడా తీసుకుని పరిశీలించాలని అన్నారు. పల్నాడులో జరిగిన అరాచకాలపై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, సాక్షి మీడియా వాస్తవాలను వక్రీకరించి ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఈమేరకు సోమవారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో లావు శ్రీకృష్ణ దేవరాయలు మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో అరాచకాలు సృష్టించిన వైసీపీ నేతలు వాటిని టీడీపీ నేతలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కులం రంగు పులిమి అధికారులతో లేని సంబంధ బాంధవ్యాలను అంటగట్టి మాపై నిందలు మోపుతున్నారని విమర్శించారు.

వాళ్లు చేసి మాపై రుద్దే ప్రయత్నం
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై సిట్ విచారణ జరుపుతోందని లావు శ్రీకృష్ణ దేవరాయలు గుర్తుచేశారు. తమ వద్ద ఉన్న ఆధారాలను దర్యాఫ్తు అధికారులకు పంపించామని, దర్యాఫ్తులో నిజానిజాలు బయటపడతాయని చెప్పారు. పల్నాడులో జరిగిన ఘటనలను తమపై రుద్దేందుకు వైసీపీ నేతలు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఎస్పీ బిందుమాధవ్ కుటుంబంతో తమ కుటుంబానికి స్నేహం ఉన్నట్లు సాక్షి అవాస్తవాలను ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. వాస్తవానికి తాము ఎస్సీని కలవనే లేదని వివరించారు. మేం కలుసుకున్నట్లు వాళ్ల దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నా సిట్ అధికారులకు ఇస్తే వాళ్లే చూసుకుంటారని చెప్పారు. తన కాల్ డేటా వివరాలను అధికారులకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఒక కులానికి ఒక వర్గానికి వైసీపీ నన్ను పరిమితం చేయాలని చూస్తోంది. ఇది అసాధ్యం.. నేను ప్రజల మనిషిని.. ప్రజల్లోనే ఉంటా'నని లావు శ్రీకృష్ణ దేవరాయలు చెప్పారు.

పోలింగ్ బూత్ లలో బందోబస్తుపై..
టీడీపీ చెప్పినట్లు పోలీసులు వినడం వల్లనే పల్నాడులో హింస చోటుచేసుకుందంటూ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని శ్రీకృష్ణ దేవరాయలు ఆరోపించారు. పోలింగ్ ప్రశాంతంగా జరగాలనే ఉద్దేశంతో సమస్యాత్మక బూత్ లలో బందోబస్తు పెంచాలని తాము పోలీసులను కోరామన్నారు. అయితే, వైసీపీ నేతలు దీనికి తప్పుడు అర్థం వెతుకుతున్నారని చెప్పారు. టీడీపీకి అనుకూలంగా ఉన్న బూత్ లలో తక్కువ మందిని, వైసీపీకి అనుకూలంగా ఉన్న బూత్ లలో ఎక్కువ మంది పోలీసులును పెట్టారంటూ నిరాధార విమర్శలు చేస్తున్నారని అన్నారు.

దాడి జరిగింది నాపైనే..
‘నాపైనే దాడి చేశారు. నా వాహనాలను ధ్వంసం చేశారు. అందరి కాల్ డేటా తీసుకుని సిట్ పూర్తిగా విచారించాలి. తప్పు నా వైపు ఉందని భావిస్తే చార్జ్ షీట్ లో నా పేరు చేర్చండి. ఓటర్లను ప్రలోభాలకు గురిచేశామన్న వార్తల్లో నిజానిజాలు బయటపెట్టాలి. దర్యాఫ్తు వివరాలు, ఇరు పక్షాల కాల్ డేటా వివరాలను పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. పమిడిపాడు, కేపీపురం, రెంటాలలో ఏమి జరిగిందో ప్రజలందరికి తెలుసు. దీనిపై ఎలక్షన్ కమిషన్ కు, సిట్ చీఫ్ కు ఫిర్యాదు చేస్తాం. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. వారిపై పరువు నష్టం దావా వేస్తాం’ అని లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు.


More Telugu News