చేతులు పనిచేయకపోయినా మెదడు ఆలోచనలతోనే కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ వాడుతున్న యువకుడు!

  • పక్షవాతానికి గురైన వ్యక్తి మెదడులో మైక్రో చిప్ అమర్చడం ద్వారా సాధ్యం
  • ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన న్యూరాలింక్ అరుదైన ఘనత
  • ఇటీవల వీడియోను షేర్ చేసిన మస్క్.. తాజాగా ఓ సంస్థకు బాధితుడి ఇంటర్వ్యూ
ప్రపంచ కుబేరుడు ఎలోన్‌ మస్క్‌ కు చెందిన న్యూరోటెక్నాలజీ సంస్థ న్యూరాలింక్‌ పక్షవాతానికి గురైన ఓ యువకుడి జీవితంలో కొత్త ఆశలను చిగురింపజేసింది. నోలాండ్ అర్బా అనే యువకుడి మెదడులో విజయవంతంగా చిప్‌ అమర్చడం ద్వారా అతని చేతులు పనిచేయకపోయినా కేవలం మెదడులోని ఆలోచనలతోనే అతను కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించేలా చేసింది. తద్వారా మనిషి మెదడులో ఇంప్లాంట్ అమర్చిన తొలి సంస్థగా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. 

ఇందుకు సంబంధించిన వీడియోను ఎలాన్ మస్క్ స్వయంగా నెటిజన్లతో ఇటీవల పంచుకున్నారు. తన సొంత సంస్థ ‘ఎక్స్’లో వీడియోను పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో తన అనుభవాలను నోలాండ్ తాజాగా ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ షోలో పంచుకున్నాడు.

2016లో సమ్మర్‌ క్యాప్‌ కౌన్సిలర్‌గా పనిచేసే సమయంలో నోలాండ్‌ అర్బా టెక్సాస్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో అతని వెన్నెముక విరగడంతో పక్షవాతానికి గురయ్యాడు. అప్పటి నుంచి వీల్‌ ఛైర్‌కే పరిమితమయ్యాడు.

మెడకింది భాగం వరకు చచ్చుపడిపోవడంతో నోలాండ్ చేతులు, కాళ్లు పనిచేయక ఏ పనీ చేసుకోలేకపోయాడు. అయితే మానవ మెదడులో ఎలక్ట్రానిక్‌ చిప్‌ను అమర్చే ప్రయోగాలు చేస్తోన్న న్యూరాలింక్‌ ఈ ఏడాది మార్చిలో నోలాండ్‌ అర్బా పుర్రెలో ఓ భాగాన్ని రోబో శస్ర్త చికిత్స ద్వారా తొలగించింది. అందులో 8 మిల్లీమీటర్ల వ్యాసంగల ఎన్‌1 అనే చిప్‌ను అమర్చింది. 

అయితే నోలాండ్ ఆర్బా మెదడులోని చిప్‌లో కొన్ని రోజులకే సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. అందులోని డేటా అంతా చెరిగిపోయింది. దీంతో న్యూరాలింక్‌ సంస్థ బాధితుడి బ్రెయిన్‌ నుంచి చిప్‌ను సరిచేసింది. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానంటూ నోలాండ్‌ ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు. ‘ఈ చిప్‌ నా జీవితాన్ని మార్చేసింది. కానీ ఒక్కసారిగా చిప్‌లో డేటా పోవడంతో భయపడ్డా. మళ్లీ నేను కంప్యూటర్ పై పనిచేసుకోలేనేమోనని ఏడ్చేశా. కానీ న్యూరాలింక్ అద్భుతం చేసింది. చిప్ లో సాంకేతికతకు మార్పులు చేయడంతో అది ఇప్పుడు బాగా పనిచేస్తోంది’ అని నోలాండ్ పేర్కొన్నాడు.


More Telugu News