‘ధోనీ కొట్టిన భారీ సిక్సరే మనల్ని ప్లే ఆఫ్స్ కు చేర్చింది’!

  • ఆర్సీబీ జట్టు విజయంపై దినేశ్ కార్తీక్ ఆసక్తికర విశ్లేషణ
  • గెలుపుపై ఆశలు సన్నగిల్లినప్పుడు అదే కీలక పరిణామమని వ్యాఖ్య
  • డ్రెస్సింగ్ రూమ్ లో అతని అభినందన స్పీచ్ వీడియోను ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఆర్సీబీ
ఓవైపు వరుణుడి దోబూచులాట.. మరోవైపు గెలుపు సమీకరణాలు.. ఆద్యంతం నరాలు తెగే ఉత్కంఠ.. ఇదీ శనివారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ జరిగిన తీరు. ఈ పోరులో విజయం బెంగళూరునే వరించింది. ప్లే ఆఫ్స్ కు చేరాలంటే కనీసం 18 పరుగుల తేడాతో గెలవాల్సిన మ్యాచ్ ను అనూహ్యంగా 27 పరుగుల తేడాతో గెలిచింది. అయితే తమ జట్టు విజయంపై ఆర్సీబీ ప్లేయర్ దినేశ్ కార్తీక్ ఆసక్తికర విశ్లేషణ చేశాడు. మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూంలో మాట్లాడుతూ సీఎస్ కే మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ కొట్టిన భారీ సిక్సరే జట్టు గెలిచేందుకు పరోక్షంగా కారణమైందని విశ్లేషించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ తమ ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసింది.

అసలు ఏం జరిగిందంటే..
సీఎస్ కే చివరి ఓవర్ లో 17 పరుగులు (ప్లే ఆఫ్స్ కు చేరాలంటే విజయానికి కాదు) చేయాల్సి ఉంది. యష్ దయాల్ లెగ్ స్టంప్ పై ఫుల్ టాస్ గా వేసిన తొలి బంతినే ధోనీ ఫైన్ లెగ్ మీదుగా స్టాండ్స్ లోకి పంపాడు. ఏకంగా 100 మీటర్ల సిక్సర్ బాదాడు. దాంతో అది కాస్తా స్టేడియం రూఫ్ పైనుంచి బయట పడిపోయింది. ఫలితంగా అంపైర్లు మరో బాల్ ను తీసుకున్నారు. అప్పటివరకు ఆడిన బంతి తడిసిపోవడంతో బౌలర్లకు దానితో బౌలింగ్ చేయడం కష్టమైంది. కొత్త బంతి అందుబాటులోకి రావడం వల్ల యష్ దయాల్ బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్ స్లోవర్ బాల్స్ వేసేందుకు వీలైంది. అలా అతను వేసిన రెండో బంతికి ధోనీ అవుట్ అవగా చివరి నాలుగు బంతుల్లో దయాల్ కేవలం ఒక్క పరుగే ఇచ్చాడు. దీని గురించే దినేశ్ కార్తీక్ చెప్పుకొచ్చాడు.

తడవని కొత్త బంతి లభించింది..
‘మనకు జరిగిన మంచి విషయం ఏమిటంటే ధోనీ స్టేడియం బయటకు సిక్స్ కొట్టడం. దీనివల్ల మనకు తడవని, బౌలింగ్ కు అనుకూలమైన కొత్త బంతి లభించింది’ అని దినేశ్ కార్తీక్ చెప్పాడు. ఇందుకు జట్టు సభ్యులంతా అవును అన్నట్లుగా తల ఆడించారు. ఈ సందర్భంగా యష్ దయాల్ బౌలింగ్ పై సరదా కామెంట్ చేశాడు. ‘యష్.. మంచి బౌలింగ్ వేశావు. బ్యాట్స్ మన్ కు ఎలాంటి బంతి వేయాలి అని మనసులో అనుమానం ఉన్నప్పుడు లెగ్ స్టంప్ పై హై ఫుల్ టాస్ వెయ్యి. బంతి తడిగా ఉన్నప్పుడు అనుసరించేందుకు అదో మంచి మంత్రం’ అంటూ వ్యాఖ్యానించాడు. అలాగే ప్లే ఆఫ్స్ లో నిలవాలంటే గెలవాల్సిన ఆరు మ్యాచ్ లను వరుసగా గెలవడం గొప్ప విషయమని చెప్పాడు. ఈ జట్టును ప్రేక్షకులంతా సుదీర్ఘకాలంపాటు జ్ఞాపకం ఉంచుకుంటారని అన్నాడు. ఈ సందర్భంగా సహచరులను ఉత్సాహపరిచాడు. ‘ఆండీ ఫ్లవర్ (జట్టు హెడ్ కోచ్) లాగా మొహం నీరసంగా పెట్టకండి. నవ్వండి.. ఎంజాయ్ చేయండి.. మందేయండి.. పార్టీ చేసుకోండి.. సరదాగా గడపండి’ అని కార్తీక్ వ్యాఖ్యానించాడు.


More Telugu News