పోలింగ్ కు రెండు రోజుల ముందు కాశ్మీర్ లో టెర్రర్ దాడులు

  • షోపియాన్ లో మాజీ సర్పంచ్ ను కాల్చిచంపిన టెర్రరిస్టులు
  • అనంతనాగ్ లో రాజస్థానీ పర్యాటకులపై కాల్పులు
  • బుల్లెట్ గాయాలతో ఆసుపత్రిలో చేరిన జంట
లోక్ సభ ఎన్నికల వేళ జమ్మూ కాశ్మీర్ లో టెర్రరిస్టులు రెచ్చిపోయారు. పోలింగ్ కు రెండు రోజుల ముందు కాల్పులతో కలకలం సృష్టించారు. రెండు వేర్వేరు సంఘటనలలో ఒక వ్యక్తి చనిపోగా మరో టూరిస్టు జంటకు బుల్లెట్ గాయాలయ్యాయి. కాశ్మీర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షోపియాన్ జిల్లాలో మాజీ సర్పంచ్ ను టెర్రరిస్టులు శనివారం కాల్చి చంపారు. అనంతనాగ్ జిల్లాలో టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో రాజస్థాన్ కు చెందిన జంటకు బుల్లెట్ గాయాలయ్యాయి.

విడతల వారీగా జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఉధంపూర్, జమ్మూ, శ్రీనగర్ నియోజకవర్గాలకు ఇప్పటికే పోలింగ్ పూర్తయింది. బారాముల్లా నియోజకవర్గానికి ఈ నెల 20 (సోమవారం) న, అనంతనాగ్- రాజౌరీ నియోజకవర్గంలో ఈ నెల 25న పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో శనివారం షోపియాన్ జిల్లాలో టెర్రరిస్టులు రెచ్చిపోయారు. జిల్లాలోని హిర్పోరా గ్రామం మాజీ సర్పంచ్, బీజేపీ నేత ఐజాజ్ అహ్మద్ షేక్ పై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడ్డ ఐజాజ్ ను స్థానికులు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయాడు.

కాశ్మీర్ లో పర్యటనకు వచ్చిన రాజస్థానీ దంపతులు తబ్రీజ్, ఫర్హాలపైన టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. అనంతనాగ్ జిల్లాలోని యాన్నర్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో తబ్రీజ్, ఫర్హాలకు బుల్లెట్ గాయాలు కాగా పోలీసులు వారిని ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నామని, ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. కాగా, టెర్రర్ దాడులను బీజేపీ సహా జమ్మూ కాశ్మీర్ లోని అన్ని పార్టీల నేతలు ఖండించారు.


More Telugu News