ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కి చేరడంతో కన్నీళ్లు ఆపుకోలేకపోయిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ.. వీడియో ఇదిగో

  • చెన్నై విజయం అనంతరం భావోద్వేగానికి గురైన కోహ్లీ దంపతులు
  • అనూహ్య రీతిలో పుంజుకొని ప్లే ఆఫ్స్‌కు చేరిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
  • సంబరాల్లో మునిగి తేలిన ఆ జట్టు ఆటగాళ్లు, అభిమానులు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అద్భుతంగా పుంజుకుంది. ఐపీఎల్-2024 పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థాయి నుంచి ఏకంగా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. శనివారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌పై 27 పరుగుల తేడాతో గెలిచి ప్లే ఆఫ్స్‌లో నాలుగవ బెర్త్‌ని ఖరారు చేసుకుంది. దీంతో ఆర్సీబీ ఆటగాళ్లతో పాటు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, అతడి భార్య అనుష్క శర్మ భావోద్వేగానికి గురయ్యారు. ఏమాత్రం ఆశలు లేని స్థితి నుంచి ప్లే ఆఫ్స్‌కు చేరడంతో విరాట్ కన్నీళ్లను అదుపు చేసుకోలేకపోయాడు. మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించిన అనుష్క శర్మ కూడా ఎమోషనల్ అయ్యింది. ఆమె కూడా కళ్లు చెమర్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీని గెలవలేకపోయింది. ఈ సారి ప్లే ఆఫ్స్‌కు చేరడంతో ఆ జట్టు ఫ్యాన్స్ గంపెడాశలు పెట్టుకున్నారు. కాగా కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్‌కు అర్హత సాధించాయి. నేడు (ఆదివారం) జరగనున్న చివరి రెండు మ్యాచ్‌ల ఫలితాల ఆధారంగా ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌లు ఏయే జట్ల మధ్య జరగనున్నాయనేది ఖరారవుతుంది.


More Telugu News