ఎన్నికల సంఘం నుంచి రాని అనుమతి... తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా

  • ఎన్నికల కోడ్ అమల్లో కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి కోరిన ప్రభుత్వం
  • రాత్రి ఏడు గంటల వరకు ఈసీ నుంచి లేని స్పందన
  • రాత్రి వరకు సచివాలయంలోనే వేచి ఉన్న మంత్రులు, అధికారులు
  • ఈసీ నుంచి అనుమతి రాకపోవడంతో కేబినెట్ భేటీ వాయిదా
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశానికి ఎన్నికల సంఘం నుంచి అనుమతి రాలేదు. దీంతో కేబినెట్ సమావేశం వాయిదా పడింది. శనివారం సాయంత్రం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకోవాలని మంత్రివర్గం భావించింది. ఇందుకు సంబంధించి అజెండాను కూడా సిద్ధం చేసింది. కానీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఈసీ అనుమతి కోరింది. కానీ అనుమతి రాకపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు సచివాలయం నుంచి తిరిగి వెళ్లిపోయారు.

ఈసీ నుంచి అనుమతి వచ్చాక కేబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. సోమవారం లోగా ఈసీ అనుమతి రాకపోతే మంత్రులతో కలిసి ఢిల్లీకి వెళ్లి అనుమతి కోరాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈసీ నుంచి ఏ క్షణమైనా అనుమతి రావొచ్చునని మధ్యాహ్నం నుంచి మంత్రులు, అధికారులు సచివాలయంలోనే వేచి ఉన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు అన్ని విభాగాల అధికారులు కేబినేట్ భేటీకి హాజరయ్యేందుకు కార్యాలయాలకు చేరుకున్నారు. కానీ రాత్రి ఏడు గంటల వరకు ఈసీ నుంచి స్పందన లేకపోవటంతో కేబినేట్ భేటీ జరగలేదు.


More Telugu News