ఎంపీ స్వాతిమాలివాల్‌పై దాడి కేసులో పీఏ అరెస్ట్... కేజ్రీవాల్ ఫైర్

  • తమ పార్టీకి చెందిన వారిని ఒక్కొక్కరినీ జైలుకు పంపిస్తూ మోదీ గేమ్ ఆడుతున్నారని విమర్శ
  • రేపు మధ్యాహ్నం బీజేపీ కార్యాలయానికి వస్తాం... అరెస్ట్ చేసుకోండని ఆగ్రహం
  • ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన తప్పేమిటని నిలదీసిన కేజ్రీవాల్
బీజేపీ కార్యాలయానికే వస్తాం... ధైర్యముంటే మా పార్టీ వారందరినీ అరెస్ట్ చేయండని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మాలివాల్‌పై దాడికి సంబంధించిన అంశంలో కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై శనివారం ఢిల్లీ సీఎం తీవ్రంగా స్పందించారు. తమ పార్టీకి చెందిన మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్, తనను... ఇలా ఒక్కరొక్కరిని ప్రధాని మోదీ జైలుకు పంపిస్తూ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. ఇంకా ఎవరిని జైల్లో పెట్టాలనుకుంటున్నారని మండిపడ్డారు.

రేపు మధ్యాహ్నం 12 గంటలకు పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలతో బీజేపీ కార్యాలయానికి చేరుకుంటామని, ఆ సమయంలో మా అందరినీ ఒకేసారి అరెస్ట్ చేసుకోండని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

అసలు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం చేసిన తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. నాణ్యమైన విద్య, మొహల్లా క్లినిక్‌లు అందించడం తప్పా? తాము చేసే మంచి పనులకు అడ్డుకట్ట వేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. తమందరినీ జైల్లో పెట్టి ఆమ్ ఆద్మీ పార్టీని నాశనం చేయాలనుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ తమ పార్టీ ప్రజల గుండెల్లో ఉందని... బీజేపీ ఆశలు నెరవేరవన్నారు.

కేజ్రీవాల్ వ్యాఖ్యలపై బీజేపీ కూడా ఘాటుగానే స్పందించింది. సొంత పార్టీ మహిళా ఎంపీపై దాడి జరిగితే కేజ్రీవాల్ మౌనంగా ఉండటం విడ్డూరమన్నారు. ఆయన డ్రామాలు ఆపితే మంచిదని ఎద్దేవా చేశారు. స్వాతి మాలివాల్‌పై దాడి జరిగి ఇన్నిరోజులు అయినా ఎందుకు స్పందించడం లేదో చెప్పాలన్నారు.


More Telugu News