జగన్ అవినీతిని ప్రశ్నించినందుకే నన్ను కిడ్నాప్ చేసి హింసించారు: ఎన్నారై వైద్యుడు లోకేశ్ కుమార్

  • పోలీసులు తనను అకారణంగా నిర్బంధించారన్న డాక్టర్ లోకేశ్ కుమార్ 
  • ఛాతీనొప్పి వస్తోందన్నా వినిపించుకోలేదని ఆరోపణ 
  • తనను ఎక్కడెక్కడో తిప్పారని ఆరోపణ
ఏపీ సీఎం జగన్ నిన్న లండన్ పర్యటనకు బయల్దేరే ముందు, గన్నవరం ఎయిర్ పోర్టులో పోలీసులు ఎన్నారై వైద్యుడు లోకేశ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. లోకేశ్ కుమార్ గత కొంతకాలంగా ఏపీలో ప్రభుత్వ పాలనను విమర్శిస్తూ పలు వీడియోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు. 

డాక్టర్ లోకేశ్ కుమార్ కు అమెరికా పౌరసత్వం ఉంది. ఇటీవల అమెరికా నుంచి భారత్ వచ్చిన ఆయన, తిరిగి అమెరికా వెళ్లే ప్రయత్నంలో ఉండగా నిన్న పోలీసులు నిర్బంధించారు. ఇవాళ మీడియా ముందుకు వచ్చిన లోకేశ్ కుమార్... తనను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఏం జరిగిందో వివరించారు. 

"జగన్ అవినీతి, అక్రమాలను ప్రశ్నించినందుకే నన్ను కిడ్నాప్ చేసి, నాపై దాడి చేశారు. ఢిల్లీ మీదుగా అమెరికా వెళ్లేందుకు టికెట్ ప్రింటింగ్ కోసం నేను గన్నవరం ఎయిర్ పోర్టుకు రాగా, సీఎం భద్రతా సిబ్బంది నన్ను గుర్తుపట్టారు. నన్ను నిర్బంధించి, ఛాతీ నొప్పి వస్తోందన్నా పట్టించుకోకుండా హింసించారు. ఎక్కడెక్కడో తిప్పారు, ఛాతీపై తన్నారు. 

నేను అమెరికా పౌరుడ్ని. నా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించి, నా పట్ల అమానవీయంగా ప్రవర్తించిన పోలీసులపై ప్రైవేటు కేసు పెడతాను. ఈ విషయంపై అమెరికా దౌత్య కార్యాలయంతో పాటు, పీఎంవోకు, జాతీయ భద్రతా సలహాదారుకు సమాచారం ఇచ్చాను. ఏపీ సీఈవోకు కూడా దీనిపై ఫిర్యాదు చేస్తాను.

నన్ను అకారణంగా నిర్బంధించిన పోలీసులపై చర్యలు తీసుకునేంత వరకు న్యాయ పోరాటం ఆపను" అని డాక్టర్ లోకేశ్ కుమార్ స్పష్టం చేశారు.


More Telugu News