అలాంటి నాయకుల వల్లే రాష్ట్రం విడిపోయింది... ఉత్తర తెలంగాణ వెనుకబడింది: రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి హెచ్చరిక

  • హైదరాబాద్ పన్నుల నిధులు దక్షిణ తెలంగాణ, కొడంగల్‌కే ఇస్తారా? అని నిలదీత
  • రేవంత్ రెడ్డి కొడంగల్‌కే ముఖ్యమంత్రా? అని ప్రశ్న
  • రేవంత్ తన నియోజకవర్గానికి 35వేల ఇళ్లు తీసుకొని... తమకు 3500 ఇచ్చారని విమర్శ
హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో మున్సిపల్ సహా వివిధ రకాల పన్నులు వసూలు చేస్తున్నారని... ఈ నిధుల్లో తమకు (ఉత్తర తెలంగాణ) భాగం లేదా? ఈ నిధుల్లో కేవలం దక్షిణ తెలంగాణ, కొడంగల్ నియోజకవర్గానికే భాగం ఉందా? అని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి తన నియోజకవర్గానికి 35 వేల ఇళ్లు తీసుకొని, తమకు కేవలం 3500 పెట్టారని విమర్శించారు. ఇది అన్యాయం కాదా? అని నిలదీశారు. 'ఇది నేరం.. ఘోరం.. ఉన్నత స్థానాల్లో ఉన్న ఇలాంటి రాజకీయ నాయకుల వల్లనే ఇంతకుముందు రాష్ట్రం విడిపోయింది. మళ్లీ ఉత్తర తెలంగాణ ప్రత్యేక ప్రాంతం. నిరుద్యోగం, పేదరికం ఎక్కువ' అన్నారు.

శనివారం ఆయన దిశ ఛానల్‌తో మాట్లాడుతూ... ఢిల్లీకి వెళ్లి... ఆర్బీఐ వద్దకు వెళ్లి రోజూ తెచ్చే అప్పులు దక్షిణ తెలంగాణకు, కొడంగల్‌కు మాత్రమే ఇస్తారా? అని నిలదీశారు. కొడంగల్‌కు రూ.1400 కోట్లు తీసుకువెళ్లినప్పుడు తనకూ నిర్మల్ నియోజకవర్గానికి అంతే మొత్తం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మీ తల్లిదండ్రులు, సోదరులు సంపాదించిన డబ్బు అయితే మీరు తీసుకోవచ్చునని ఎద్దేవా చేశారు. కానీ ఆర్మూర్‌కు రావాల్సిన వాటా రావాలన్నారు.

రేవంత్ రెడ్డి కేవలం కొడంగల్ నియోజకవర్గానికే ముఖ్యమంత్రి అన్నారు. కొడంగల్‌కు ఆయన ఎలా ఎమ్మెల్యేనో... ఆర్మూర్‌కు తానూ అలాగే ఎమ్మెల్యేనని పేర్కొన్నారు. ఆర్మూర్‌లో పేదరికం ఎక్కువ అన్నారు. ఆయన ప్రతిదీ తన నియోజకవర్గానికి ఎక్కువగా తీసుకువెళుతున్నారని ఆరోపించారు. నాటి పరిస్థితుల వల్ల ఉత్తర తెలంగాణలో యువత నక్సలిజం, ఉద్యమాల్లోకి వెళ్లారని, ఎన్‌కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారన్నారు. ఉన్నత విద్యావంతులు, తమకంటే తెలివైన వారు ఉద్యమాల్లోకి వెళ్లి బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.


More Telugu News